జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ మేరకు వివరాలను వెల్లడించారు ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారధి . డిసెంబర్ 1న బల్దియా పోలింగ్ జరగనుండగా 4న కౌంటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
రేపటి నుండే నామినేషన్లు ప్రారంభం కానుండగా నవంబర్ 20న నామినేషన్లకు చివరి రోజు. 21న పరిశీలన , 22న నామినేషన్ ఉపసంహరణ,డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న అవసరమైతే రీపోలింగ్ జరిగే అవకాశం ఉండగా 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు.
గ్రేటర్ పరిధిలో 74,04,486 మంది ఓటర్లు ఉండగా.. ఎన్నికల కోసం 9,248 స్టేషన్లను ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పోలింగ్‌స్టేషన్లలో తక్కువ మంది సిబ్బందితోనే ఎన్నికలు సక్రమంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఒకే కుటుంబానికి చెందిన ఓట్లన్నీ ఒకే చోట ఉండేలా చర్యలు చేపట్టారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతుండడంతో వీలైనంత ఎక్కువ మంది సిబ్బందిని తీసుకొని పకడ్బందీగా ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ చూస్తోంది. ఫిబ్రవరి 10తో ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది.