ఈ నెల 16న సోమవారం హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 శాసన సభ నియోజకవర్గాల ఫోటో ఓటరు జాబితా ముసాయిదాను ప్రచురించినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి మరియు జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల కమీషన్ జారీచేసిన నిబంధనల ప్రకారం 2020 జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను చేపట్టిన్నట్లు తెలిపారు.
ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకొని, తమ ఓటును నిర్థారణ చేసుకోవాలని సూచించారు. ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరును పరిశీలించుకునేందుకై సి.ఇ.ఓ వెబ్‌సైట్ www.ceotelangana.nic.in నందు అప్‌లోడ్ చేసినట్లు తెలిపారు. అలాగే ముసాయిదా ఓటరు జాబితా శాసన సభ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, సంబంధిత పోలింగ్ కేంద్రానికి చెందిన బూత్‌లేవల్ ఆఫీసర్ల వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఓటరు జాబితా వివరాలు ECI వెబ్‌సైట్ https://www.nvsp.in లో చూసుకోవచ్చునని తెలిపారు. జాబితాపై అభ్యంతరాలను, పేర్ల నమోదుకు జనవరి 15లోపు క్లైమ్ చేయవచ్చునని సూచించారు.