హైదరాబాద్ నగరంలో నేడు మధ్యాహ్నం నుండి అకస్మిక వర్షానికి నగరవాసులకు ఏవిధమైన ఇబ్బందులులేకుండా జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రెస్క్యూ టీమ్‌లు సకాలంలో స్పందించాయి. నగరంలో అకస్మిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నేడు మధ్యాహ్నం హెచ్చరించగానే ఇంజనీరింగ్ మాన్సూన్ బృందాలు, అర్బన్ బయోడైవర్సిటీ, ఎమర్జెన్సీ రెస్క్యూ బృందాలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ అప్రమత్తం చేస్తూ ఆదేశాలు జారీచేశారు.
నగరంలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు దాదాపుకు 50పైగా ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడడంతో వాటిని తొలగించి ట్రాఫిక్‌కు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు పనిచేశాయి. వీటితో పాటు పలు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడడంతో స్వల్పంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బల్దియా అత్యవసర బృందాలు స్పందించి నీటి నిల్వలను తొలగించాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడడం, చెట్లు కూలిన ఫిర్యాదులను మై జీహెచ్ఎంసీ యాప్, డయల్ 100, ఎమర్జెన్సీ కంట్రోల్ రూంకు అందిన ఫిర్యాదులు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి రావడంతో వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టారు.
ముఖ్యంగా రాజ్‌భవన్ రోడ్, అసెంబ్లీ, హిమయత్‌నగర్, మాదాపూర్, బంజారాహిల్స్, అంబర్పేట్, ఐఎస్ సదన్, యాకత్‌పుర, టోలీచౌకి, షేక్‌పేట్, అమీర్‌పేట్, శ్రీనగర్ కాలనీ, ఎల్బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో రహదారులపై వర్షపునీరు నిల్వడంతో వాటిని జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డి.ఆర్.ఎఫ్ రెస్క్యూ టీమ్‌లు తొలగించాయి. దీంతో పాటు జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూం నుండి నగరంలో వాటర్ లాగింగ్ ఏరియాలను గుర్తించి సమీపంలోని మాన్సూన్ బృందాలకు సమాచారం అందించడంతో వెంటనే వాటిని తొలగించి నగరవాసులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.