నెయ్యి..ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

4
- Advertisement -

నెయ్యిని అనాది కాలం నుంచి మన భారతీయ వంటకాలలో సూపర్ ఫుడ్గా ఉపయోగిస్తూ వస్తున్నారు. పిండి వంటకాలు, స్వీట్లు, దద్దోజనం, ముద్దపప్పు వంటి ఎన్నో వంటకాల్లో నెయ్యి తప్పనిసరి. అలాగే వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి కలిపి తింటే వచ్చే రుచి వర్ణనాతీతం. అందుకే నెయ్యి కాంబినేషన్ ఉన్న ఆహారాలకు చాలామంది అభిమానులే ఉంటారు. అయితే నెయ్యి అంటే ఉన్న ఇష్టంతో కొందరు అతిగా తీసుకుంటుంటారు. ఇలా నెయ్యిని అధికంగా సేవించడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నెయ్యిలో విటమిన్ A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ నెయ్యిలో సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉండటంతో, అతిగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక నెయ్యి వినియోగం వల్ల బరువు వేగంగా పెరగడం, ఊబకాయం, స్థూలకాయం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు, కిడ్నీ సమస్యలు, రక్తపోటు పెరగడం వంటి సమస్యలకు కూడా దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read:TTD:లడ్డూ విక్రయ కేంద్రాల వద్దే UPI పేమెంట్స్‌

కొంతమందికి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యి తినే అలవాటు ఉంటుంది. ఇది పరిమితంగా తీసుకుంటే మంచిదే అయినా, అధికంగా తీసుకుంటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలాగే ఒట్టి నెయ్యిని తినడం వల్ల కఫం ఏర్పడే అవకాశమూ ఉంటుంది. కాబట్టి నెయ్యిని భోజనంలో మితంగా ఉపయోగించుకోవాలని, నెయ్యితో చేసిన స్వీట్లను వీలైనంత వరకు తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి మేలు కావాలంటే నెయ్యిని పరిమితిలోనే తీసుకోవడమే ఉత్తమం.

- Advertisement -