ముంద‌స్తుకు రెడీ.. శ్రేణులు ఎన్నిక‌ల‌కు సిద్ధం కండి

274
cm kcr bhavan
- Advertisement -

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పురోగభివృద్ధితో అగ్రస్థానంలో దూసుకెళుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం, టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ,పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

cm kcr bhavan  

వచ్చే నెల 2వ తేదీన నిర్వహించే ప్రగతి నివేదన సభలో ఎన్నికల భేరీ మోగిద్దామని సీఎం కేసీఆర్‌ పార్టీ నాయకులకు తెలిపారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుండి 25లక్షల మందికి పైగా జనం హాజరవుతారని, అందుకనుగునంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా హైదరాబాద్‌ నగరంలో ఉన్న అన్ని స్థానాల్లో గెలుస్తామని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చేది తనకు కూడా తెలియదని, ఏ క్షణాన ఎన్నికల నొటిఫికేషన్‌ వచ్చినా పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు.

cm kcr bhavan

ఇప్పటికే పలు సర్వేల్లో వెల్లడైనట్లుగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ 101 స్థానాల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతోందని, దేశ చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో ప్రగతి నివేదన సభను నిర్వహించాలని, అందుకు వేల సంఖ్యలో బస్సులు, ప్రైవేటు వాహనాలు, కార్లు, ట్రాక్టర్లను జనసమీకరణకు వినియోగించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఎన్నికల సంగ్రామంలో సెప్టెంబర్‌ నెలాఖరుకు, లేదా అక్టోబర్‌ మొదటి వారంలో అభ్యర్థులను ఖరారు చేస్తామని ఈ  సందర్భంగా సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

- Advertisement -