తెలంగాణకు పెట్టుబడుల వరద ప్రవాహం కొనసాగుతుంది. తాజాగా తెలంగాణలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కోసం జెమిని ఎడిబుల్స్ సంస్థ మంత్రి కేటీఆర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. సింగపూర్‌కు చెందిన గోల్డెన్ అగ్రి ఇంటర్‌నేషనల్, ఫ్రీడమ్ ఆయిల్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో పెట్టుబడి పెట్టనున్నారు. సూమారుగా హైదరాబాద్‌లో రూ.400కోట్ల పెట్టుబడితో ఆయిల్ రిఫైనరీ ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. జెమిని ఎడిబుల్స్ సంస్థ నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రికేటీఆర్ ప్రభుత్వం తరపున అన్ని రకాల సహయం అందిస్తామని హామీనిచ్చారు.
సీఎం కేసీఆర్ చొరవతో తెలంగాణలో హరిత, నీలి, గులాబి, శ్వేత విప్లవాలు వృద్ది చెందుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 20లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుతో పసుపు విప్లవం దిశగా తెలంగాణ వెళ్లుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జెమిని ఎడిబుల్స్ సంస్ధ ద్వారా తెలంగాణలోని రైతులందరికి మేలు జరుగుతుందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని యూనిట్లు ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు.
జెమిని ఎడిబుల్స్ సంస్థ ద్వారా సూమారుగా ఒకవెయ్యి మందికి పైగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. దీంతో పాటుగా తెలంగాణ ఫామ్ ఆయిల్ సాగు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.