గౌతమి.. చాలా మందికి నటిగా తెలుసు. కానీ ఆమె చాలామందికి స్పూర్తి కూడా. ఎందుకంటే క్యాన్సర్‌ని జయించిన గౌతమి అవగాహన కల్పించేందుకు పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల కమల్‌తో 13 ఏళ్ల సహజీవనానికి గుడ్ బై చెప్పిన గౌతమి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
తాను సినీ రంగంలో అడుగుపెట్టినప్పుడు ఆ రంగం గురించి తనకేమీ తెలియదని, జీవితంలో ప్రతిదీ పోరాడి సాధించానని అన్నారు. ఆర్టిస్ట్ ని కావాలనే తన తపన, తన తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే తాను ఈ రంగంలోకి ప్రవేశించానని పేర్కొంది. పదహారేళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చిన తాను, ఈ ఇండస్ట్రీని క్రమక్రమంగా అర్థం చేసుకున్నానని తెలిపింది.
తెలుగు ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలతోనూ తాను నటించానని, చిరంజీవితో నటించే అవకాశాలు వచ్చినా నటించలేకపోయానని గౌతమి పేర్కొంది. ఆ అవకాశాలు వచ్చిన ప్రతిసారి రజనీకాంత్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండేదానినని గుర్తుచేసుకుంది.
గతంలో అయితే, పర్సనల్ లైఫ్ కు, ప్రొఫెనల్ లైఫ్ కు పెద్దగా తేడా ఉండేది కాదు. ఎక్కడి కెళ్లినా పని, సినిమా ఇండస్ట్రీ.. ఇదే మన ప్రపంచం అనేట్టుగా గతంలో ఉండేది. ఇప్పుడు మాత్రం అలా లేదని తెలిపింది. ఫలానా డైరెక్టర్ తో, ఫలానా హీరోతో చేయలేకపోయాననే బాధ తనకు ఉందని, ఈ ఆలోచన వచ్చినప్పుడు తనది చిన్నపిల్ల మనస్తత్వం అనిపిస్తుందని తెలిపింది. తాను టీవీ ఎక్కువ చూడనని, ఆ అలవాటు చాలా తక్కువ అని, తనకు ఉన్న పనుల కారణంగా ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదనే భావన కలుగుతోందని గౌతమి పేర్కొంది.