ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసు విచారణకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ని ఏర్పాటుచేసింది. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధారామయ్య ప్రకటించారు. ఐజీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తున్నట్లు తెలిపారు.
గౌరీ లంకేష్ హత్యను ఖండించిన సిద్ధారామయ్య.. తాను ఒక మంచి మిత్రురాలిని కోల్పోయానన్నారు. సీసీటీవీలో దుండగుల ముఖాలు సరిగ్గా కనిపించలేదని, అయితే మిగిలిన ఆధారాలను కూడా సేకరిస్తున్నట్లు చెప్పారు. మూడు బృందాలు ఏర్పడి.. లంకేష్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్నాయని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.
బెంగళూరులోని తన నివాసంలో గుర్తు తెలియని దుండగులు గౌరీ లంకేష్ ను కాల్చి చంపిన విషయం తెలిసిందే. కన్నడ పత్రిక గౌరీ లంకేష్ పత్రికే కు ఎడిటర్ గా పని చేస్తున్న ఆమె.. నిన్న రాత్రి విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది.