గరికపాటి ఆవిష్కరించి శ్రీ మధ్భాగవత కథలు గ్రంధం..

197
Garikipati Narasimha Rao

ఎంతో సరళంగా క్లుప్త సౌందర్యంగా సమకాలీన సమాజానికి శ్రీమద్భాగవతాన్ని కథలుగా శ్రీ వనం జ్వాలా నరసింహారావు అందించారని మహా సహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు ప్రశంసించారు. ఏ పురాణం అయినా ఇతిహాసం అయినా సంక్షిప్తం చేసి రాయడం చాలా కష్టం అయితే జ్వాలా గారి శ్రీమద్భాగవత కథలు మూలానికి అద్దం పట్టే విధంగా అందరికీ అర్థమయ్యేలా రాశారని అన్నారు. విజయదశమి పర్వదినాన ఆదివారం ఉదయం జూమ్ అంతర్జాల వేదికగా దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ప్రచురించి నిర్వహించిన ప్రముఖ రచయిత,ముఖ్యమంత్రి ప్రధాన ప్రజాసంబందాల అధికారి వనం జ్వాలా నరసింహారావు రచన శ్రీ మధ్భాగవత కథలు గ్రంధాన్ని మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు ఆవిష్కరించి అనంతరం ప్రసంగించారు.

ఈ గ్రంథం పండితుల నుంచి పామరుల దాకా ప్రతి ఒక్కరికి చదవటానికి ఆసక్తికరంగా పారాయణ గ్రంథంగా ఉంటుందన్నారు. పోతన భాగవతంలోని ముఖ్యమైన పద్యాలను అన్నిటినీ ఈ గ్రంథంలో ఉటంకించి కథారచన సాధించారని పేర్కొన్నారు. రామాయణ భారత భాగవత గ్రంథాలు ఇంట్లో ఉంచుకోవడమే కాదు వాటిని పఠించి, అనునయించి వాటిలోని ధర్మాలను ఆచరించాలని అప్పుడే ఆ గ్రంథ పఠనానికి సార్థకత ఉంటుందన్నారు. ఈ సభలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వల్లూరి శ్రీరామచంద్రమూర్తి గారు ప్రసంగిస్తూ వనం జ్వాలా నరసింహారావు రచించిన ఈ శ్రీమద్భాగవత కథలు ఎంతో ఉపయుక్తమైన గ్రంథమని దీనిలో భాగవత కథలతో పాటు అనుబంధంగా వేదాలకు సంబంధించిన విశేషాలను సమగ్రంగా అందించడం ముదావహం అన్నారు. ఎంతో ఉత్కృష్ట పురాణమైన భాగవతం కథలను చాలా సరళంగా అందించారని యువతకు ఈ గ్రంథం ఎంతో ఉపయోగపడగలదు అన్నారు.

ఇంకా ఈ గ్రంధావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ధార్మిక సాహిత్యం ఆధ్యాత్మికవేత్తలు వనం జ్వాలా నరసింహారావు ధార్మిక రచనా వ్యాసంగాన్ని ప్రస్తుతించారు. ఇంతకుముందు రామాయణ గ్రంథాలను ఇప్పుడు శ్రీ మద్భాగవత కథలను అందించడం సంతోషకరమని భవిష్యత్తులో మహాభారతాన్ని కూడా సరళంగా అందించాలని సూచించారు. కేంద్ర సమాచార పూర్వ కమిషనర్ ఆచార్య మాడభూషి శ్రీధర్, ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్ పూర్వ కార్యదర్శి డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు, ప్రసిద్ధ సినీ నటులు రచయిత శ్రీ తనికెళ్ళ భరణి, రిటైర్డ్ పోలీస్ అధికారి రావులపాటి సీతారాంరావు, దూరదర్శన్ పూర్వ సంచాలకులు ఆర్ వి వి కృష్ణారావు, సీనియర్ పాత్రికేయులు భండారు శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సంపాదకులు వెంకట రమణ శర్మ అధ్యక్షత వహించారు. చివరగా పుస్తక రచయిత శ్రీ వనం జ్వాలా నరసింహారావు తన స్పందన తెలియజేస్తూ భగవదనుగ్రహంతో తాను పుస్తక రచన సాగిస్తున్నారని పేర్కొన్నారు తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమంలో శ్రీయుతులు తుర్లపాటి విజయ్ శంకర్, పొట్లపల్లి కళాధర్, భండారు రామచంద్ర రావు ,చెన్నాప్రగడ మూర్తి దంపతులు, గాడిచర్ల పరిమళ, ఆదిత్య కృష్ణ రాయ్ దంపతులు, ప్రేమ మాలిని,ఆనిరుధ్ పొట్లపల్లి, చంద్ర రెంటచింతల పాల్గొన్నారు. ఇంద్రకంటి వెంకట్ ఆధ్వర్యంలో భ్రామరి వేదపాఠశాల వేదపండితులు తొలుత వేద వేద స్వస్తి అందించగా విపంచి మ్యూజికల్ అకాడమీ వ్యవస్థాపకులు మరుమాముల శశిధర్ శర్మ స్వాగత గీతాన్ని ఆలపించారు.దాదాపు మూడుగంటల పాటు ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమం సాగింది.పలు దేశాలనుంచి వందలాదిమంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.