బండ్లు ఓడలు..ఓడలు బండ్లు అవడం అంటే ఇదేనేమో…గతంలో వైఎస్ జగన్‌కు ఎదురైన అనుభవమే నేడు మాజీ సీఎం చంద్రబాబుకు ఎదురైంది. గన్నవరం విమానాశ్రయంలో అధికారుల నుంచి ఉహించని అనుభవం ఎదురైంది. హైదరాబాద్ వెళ్లేందుకు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. బాబు వాహనాన్ని భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో చంద్రబాబు సామాన్య ప్రయాణికుడిలాగే లోపలికి వెళ్లగా.. సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను కూడా తనిఖీ చేశారు.
ఇతర ప్రయాణికులు వెళ్లే మార్గంలోనే ఆయన విమానాశ్రయంలోకి వెళ్లారు. విమానాశ్రయ భద్రతా సిబ్బంది ఆయనను మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేశారు. ఆ తర్వాత ఆయన సాధారణ ప్రయాణికులతో కలసి, వారు ప్రయాణించిన బస్సులోనే వెళ్లి విమానం ఎక్కారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రొటోకాల్ ప్రకారం నేరుగా విమానం వద్దకు కాన్వాయ్‌లో వెళ్లేవారు. ఈసారి విమానాశ్రయ భద్రత అధికారులు దానికి అనుమతించకపోవడంతో ప్రతిపక్షనేతయిన ఆయన సాధారణ ప్రయాణికుల మార్గంలో వెళ్లాల్సి వచ్చింది.
గతంలో వైఎస్ జగన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైన సంగతి తెలిసిందే. అంతేగాదు పలుమార్లు జగన్ ప్రయాణిస్తున్న సమయంలో ఆటంకాలు కూడా కలిగించారు. అయితే ఈ సారి చంద్రబాబుకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే, అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ప్రత్యేక విమానంలో ప్రయాణాలు చేసి.. నేరుగా విమానం వద్దకే తన కాన్వాయ్‌ను తీసుకెళ్లటం..ఇదే పదే పదే చూసిన టీడీపీ నేతలకు ఇప్పుడు జరిగిన తీరు కొత్తగా కనిపిస్తోంది. ప్రొటోకాల్ ప్రకారం డిప్యూటీ సీఎంకు తనిఖీలు ఉండవు. కానీ, ప్రతిపక్ష నేతను తనిఖీ చేసిన తరువాతనే అనుమతించాలని స్పష్టం చేస్తోంది. అది కేవలం ఏపీకే పరిమతం కాదు. దేశం మొత్తం ఒకటే విధానం.