విఘ్నాలను తొలగించే విఘ్నేశా…నమో నమః

445
lord ganesha
- Advertisement -

 గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకొనేందుకు అఖండ భారతావణి ముస్తాబైంది. ఆది దేవుడి వేడుక కావడంతో… అంబరాన్నంటే ఏర్పాట్లలో ఉత్సవ కమిటీలు తలమునకలయ్యాయి. ఇప్పటికే తీరొక్క పందిళ్లు కనుల విందు చేస్తున్నాయి. పార్వతీదేవి ముద్దుల తనయ… బొజ్జ గణపయ్య మరి కాసేపట్లో కొలువుదీరనుండగా…పువ్వు, పత్రి తెచ్చాం.. పూజలందుకో మా గణపయ్యా..! అంటూ ఊరూ, వాడా మార్మోగనుంది.

మన పండగలన్నీ ప్రకృతి ఆరాధనతో మమేకమై వుంటాయి. వినాయకచవితి పర్వదినంలో మనం అనేక పుష్పాలు, ఫలాలతో స్వామిని పూజిస్తాం.  విఘ్నాలు తొలగించే వినాయకుణ్ణి భాద్రపద శుద్ధ చవితినాడే కాదు,అన్ని శుభకార్యాల్లో,అన్ని సందర్భాల్లో పూజించడం తరతరాలుగా వస్తున్నసంప్రదాయం. ఇంట్లో ఏ పండగ, పూజ కార్యక్రమాలు జరిగిన తొలుత కొలిచేది గణనాథున్నే.

వినాయకచవితి నాడు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకుని, వినాయకుడిని ఎంతో అందంగా అలంకరిస్తారు. విగ్రహాన్ని రకరకాలుగా తయారుచేసుకుంటారు. కంప్యూటర్ ముందు కూర్చున్న వినాయకుడు, రకరకాల కూరగాయలతో వినాయకుడు, ఆకులతో, పండ్లతో, డ్రైఫ్రూట్స్‌తో… ఎవరికి తోచిన ఆకృతిలో వారు ఆ గణనాయకుని పూజిస్తారు.ప్రతిమను ఉంచే గదిని సైతం తీర్చిదిద్దుతారు. గణేశ్ బర్త్‌డే అంటే పిల్లలకి అంత క్రేజ్ మరి. నేపాల్, చైనా, జపాన్, జావా దేశాలలో, ఇంకా జైన బౌద్ధులు సైతం వినాయకుడిని కొలుస్తారు.

అంతుపట్టని వింత దేవుడు..

మనం మొట్టమొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కుడా ఆయన్నే పూర్ణకుంభం లాంటి ఆ దేహం, బానవంటి కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు ఏనుగు తల, సన్నని కళ్లు, సునిశిత పరిశీలనకు, మేధస్సుకు సంకేతాలు. ఆ వక్రతుండము, ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక అదే ఆత్మలోని చమత్కారం. ఆ పొట్టను చుట్టి వుండే నాగుపాము శక్తికి సంకేతం, జగత్తునంతా ఆవరించి వున్న మాయాశక్తే నాగము. నాలుగు చేతులు మానవతీత సామర్థ్యానికి సంకేతం. చేతిలో ఉన్న పాశ, అంకుశములు బుద్ధి, మనస్సును సన్మార్గంలో నడిపించే సాధనాలకు ప్రతీకగా నిలుస్తాయి. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే. మరోక చేతిలో మోదకం (వెలక్కాయ) ఉంటుంది. మూడు కళ్లు, ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు, నిగూడ సంకేతాలు కలిగిన అధినాయకుడు మన వినాయకుడే.

ఆది దేవుడి జననం..

కైలాసంలో పార్వతి భర్త పరమశివుడి రాకను విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది. దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆ దివ్వ సుందరున్ని వాకిట్లో ఉంచి, ఏవర్ని లోనికి రానివ్వొద్దని చేప్పి లోపలికి వెళ్లింది. అక్కడికి వచ్చిన శివుడు లోనికి వెళ్లేందుకు యత్నించగా ఆ బాలుడు అడ్డుకుంటాడు. తననే రానీయకుండా అడ్డుకుంటావా అని శివుడు కోపంతో ఆ బాలుడి శిరస్సు ఖండించి లోపలికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న పార్వతి విలపించింది. దీంతో శివుడు ఆడవికి వెళ్లి దక్షిణ వైపు తల ఉండి చనిపోయిన ఏ ప్రాణి శిరస్సునైనా తెమ్మని ఆదేశిస్తాడు. ఆ దిశలో ఏనుగు తల ఉండడంతో దాన్ని తీసుకువస్తారు. ఆ శిరమును అతికించి, శ్వాస తత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు. ఈశ్వరుడి వల్ల విఘ్నత చెందడం వల్ల ఆయనకు విఘ్నేశ్వరుడనే పేరు వచ్చింది. వరాహపురాణం ప్రకారం విఘ్నేశ్వరుడు ఆకాశ స్వరూపం. గణేషుడు గజానానుడై, శివపార్వతులు ముద్దుల కుమారు డయ్యాడు.

ఏకదంతుడు ఎలా అయ్యాడంటే..

కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుడిని దర్శించుకోవాలని కైలాసం వెళ్లాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలాగా ఉన్న గణపతి పరుశరాముడిని లోపలికి వెళ్లడానికి వీలుపడదని నివారించాడు. దీంతో ఇద్దరి మధ్య యుద్ధం నెలకొంటుంది. గణపతి తన తొండంతో పరశురాముడిని పైకెత్తి పడవేశాడు. ఆగ్రహించిన పరశురాముడు తన గండ్ర గొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది. నెత్తురోడుతున్న బాల గణపతిని ఎత్తుకొని పార్వతి పరశరాముడిని మందలించింది. అంతటితో ఆ కథ సమాప్తమైనా గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకొని ఏకదంతుడిగా పేరు పొందాడు.

విఘ్నేశాధిపత్యం..

దేవతలు పరమేశ్వరుడిని పూజించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. తనకే ఆధిపత్యం ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. దీంతో శివుడు మీ ఇద్దరిలో ముల్లోకాల్లోని పవిత్ర నదులన్నింటిలో స్నానములు చేసి ముందుగా నా వద్దకు ఎవరు వస్తారో వారికి ఈ ఆధిపత్యం వస్తుందని చెప్పాడు. కుమారస్వామి చురుకుగా సులువుగా సాగివెళ్లాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. దీంతో వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో కుమారస్వామి కంటే ముందు మూడు కోట్ల యాభై లక్షల నదులలో స్నానాన్ని ఆచరిస్తాడు. దీంతో వినాయకుడికే ఆధిపత్యాన్ని ఇవ్వాలని కుమారస్వామి ప్రాధేయపడుతాడు.

చవితి రోజు చంద్రుడిని చూస్తే నిలాపనిందలు..

విఘ్నేశాధిపత్యం రావడంతో భక్తులు సమర్పించిన పిండి వంటలు, పానకం, వడపప్పు విఘ్నేశ్వరుడు పుష్టిగా తింటాడు. సూర్యాస్తమయం వేళకు కైలాసానికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. వినాయకుడి అవస్థను చూసి శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు నవ్వుతాడు. దీంతో వినాయకుని పొట్టపగిలి మృతి చెందుతాడు. పార్వతి శోకిస్తూ నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందల భరిస్తారని శపిస్తుంది. ఈ విషయాన్ని దేవతలు పరమశివునికి తెలుపడంతో పార్వతీ నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు కలుగుతుంది. శాపాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతాడు. ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చూసిన వారికి నీలాపనిందలు తప్పవని శాపాన్ని సడలిస్తుంది. భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రమే చంద్రుడిని చూడకుండా జాగ్రత్త పడుతారు. అందుకే ఈ రోజున చంద్రుడిని చూడొద్దని పెద్దలు అంటుంటారు.

Also Read:తులసి గింజలతో ఎన్ని లాభాలో..!

- Advertisement -