కుమ్మేసిన గంభీర్ సేన..

223
Gambhir, Lynn blaze away in record chase
- Advertisement -

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌-10లో శుభారంభం చేసింది. గత సీజన్‌లో లయన్స్‌ చేతిలో రెండు సార్లు చావు దెబ్బ తిన్న గంభీర్ సేన ఈ సారి ఐపీఎల్‌లో కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. గుజరాత్‌ లయన్స్‌ను దాని సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. 184 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒక్క వికెట్టయినా కోల్పోకుండా 14.5 ఓవర్లలోనే ఛేదించేసింది నైట్‌రైడర్స్‌.

Gambhir, Lynn blaze away in record chase

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా తమ తొలి ఓవర్‌లో ఏడు పరుగులే చేసినా… ఆ తర్వాత ఓపెనర్లు గంభీర్, లిన్‌ ఆకాశమే హద్దుగా బౌండరీలతో చెలరేగారు. గ్రౌండ్ నలువైపులా పరుగుల వరద పారించారు. మూడో ఓవర్‌ నుంచి రెచ్చిపోయిన వీరిద్దరు పవర్‌ ప్లేలో 73 పరుగులు చేశౄరు. ఇక ఏడో ఓవర్‌లో లిన్‌.. స్మిత్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఏకంగా మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌ బాదడంతో 19 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయ్యింది. 8 ఓవర్లలోనే కేకేఆర్‌ సెంచరీ మార్కు దాటింది. అటు గంభీర్‌ 33 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. గోని మరో సారి బౌలింగ్‌కు దిగగా గంభీర్‌ మూడు ఫోర్లు బాది 15 పరుగులు సాధించాడు. ఇక 15వ ఓవర్‌లో లిన్‌ ఇచ్చిన క్యాచ్‌ను మెకల్లమ్‌ బౌండరీ లైన్‌ దగ్గర వదిలేయడంతో సిక్స్‌గా వెళ్లింది. ఆ తర్వాత వరుసగా 4,6 సహా మొత్తం 22 పరుగులు రాబట్టి జట్టుకు కావాల్సిన విజయాన్ని అందించాడు.

క్రిస్‌ లిన్‌ విధ్వంసం ముందు గుజరాత్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి.  క్రీజులో బ్యాటుతో కరాళ నృత్యం చేసిన  ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌… సింగిల్స్‌ తీసినంత సులువుగా, బంతిని బౌండరీలకు పరుగులు పెట్టించాడు.  లిన్‌ (93 నాటౌట్‌; 41 బంతుల్లో 6×4, 8×6).. నిమిషాల్లో హీరో అయిపోయాడు. మ్యాచ్‌ ముగిసే సమయానికి అతడి పేరు మార్మోగిపోయింది. లిన్‌కు తోడుగా కోల్‌కతా కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ (76 నాటౌట్‌; 48 బంతుల్లో 12×4) కూడా మెరుపులు మెరిపించడంతో లయన్స్‌కు దిక్కు తోచలేదు. ఆ జట్టు కోల్‌కతా ముందుంచిన 184 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. మొత్తం టీ20ల్లోనే వికెట్‌ నష్టపోకుండా ఛేదించిన అత్యధిక ఛేదన ఇదే కావడం విశేషం.

Gambhir, Lynn blaze away in record chase

అంతకముందు టాస్ గెలిచిన కోల్ కతా …. గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సురేశ్‌ రైనా (68 నాటౌట్‌; 51 బంతుల్లో 7×4), దినేశ్‌ కార్తీక్‌ (47; 25 బంతుల్లో 6×4, 2×6), బ్రెండన్‌ మెక్‌కలమ్‌ (35; 24 బంతుల్లో 4×4, 2×6) లు రాణించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో  4 వికెట్లకు 183 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలింగ్‌ను వూచకోత కోసి కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించిన లిన్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

- Advertisement -