హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో కరోనా ఆస్పత్రి సిద్ధమైంది. 1500 పడకలతో ఏర్పాటైన ఈ ఆస్పత్రిని ఇవాళ ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం. కరోనా నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చేశారు.
ఫర్నిచర్, మెడికల్ కిట్స్‌ను ఇప్పటికే ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించేందుకు డిప్యూటేషన్ మీద 70 మంది డాక్టర్లను, 120 మంది నర్సులను, పారా మెడికల్ స్టాఫ్‌ని సిద్ధంగా ఉంచారు.
ప్రత్యేక వార్డులు, వైద్య పరికరాలు, ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాలను కూడా సిద్ధంచేశారు. గచ్చిబౌలి దవాఖానను పూర్తిగా వైరస్ చికిత్సకు ఉపయోగిస్తారు. దీంతో పాటు నేచర్‌క్యూర్ దవాఖాన.. బేగంపేట, ప్రభుత్వ నిజామియా జనరల్ దవాఖాన,చార్మినార్, ప్రభుత్వ ఆయుర్వేద దవాఖాన,ఎర్రగడ్డ, ప్రభుత్వ ఆయుర్వేద బోధన దవాఖాన,వరంగల్, ప్రభుత్వ హోమియో దవాఖాన, రామంతాపూర్ వంటి దవాఖానల్లో రోగుల సంఖ్యను బట్టి చికిత్సలు అందిస్తారు.