తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండవ దశ విస్తరణకు ఆమోదం తెలపాలని కోరారు. లక్డీకాపూల్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు 26కి.మీ, నాగోల్ నుంచి ఎల్‌బీనగర్ వరకు 5కి.మీ మెట్రో లైన్‌కు ఆమోదం తెలిపి ఆర్థిక సాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరి పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకురావాలని మరొక ప్రతిపాదనను కేటీఆర్ సమర్పించారు.
హైదరాబాద్ పరిధిలో చేపట్టిన లింకు రోడ్డుల కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయని ఇప్పటికే 22 మిస్సింగ్ లింక్ రోడ్లను పూర్తి చేశామని, మరో 17 రోడ్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయని కేటీఆర్ తెలిపారు. ఇదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్డు నుంచి పరిసర పురపాలికలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించేందుకు దాదాపు రూ. 2,400 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 800 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నగరంలోని పారిశుద్ధ్య కార్యక్రమాలు ముఖ్యంగా ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను శుద్ధి చేయడంతో పాటు చెత్తను తరలించేందుకు అవసరమైన వాహనాల ప్రోక్యూర్‌మెంట్ కోసం, ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ల నిర్మాణం వంటి వివిధ కార్యక్రమాల కోసం స్వచ్ఛ భారత్ మిషన్ లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కింద రూ. 400 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు.
Also Read: VinodKumar:అక్కడ మరో ప్రత్యామ్నాయం లేదు..
రూ. 3,050 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి 15 శాతం నిధులను కేంద్రం అందించాలని ఇందుకోసం రూ. 450 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో చేపడుతున్న ఎస్‌టీపీల నిర్మాణ ఖర్చు దాదాపు రూ. 3,722 కోట్లు అని ఇందులో కనీసం 20 శాతం రూ. 744 కోట్లను కేంద్ర ప్రభుత్వం అందించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం నిర్దేశించిన సిటిజన్ సెంట్రిక్ రిఫార్మ్స్ కింద బయో మైనింగ్, మానవ వ్యర్ధాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టిందని వీటి అన్నింటి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలికల్లో చేపడుతున్న కార్యక్రమాలకు మొత్తంగా రూ. 3,777 కోట్ల ఖర్చు అవుతుందని ఇందులో రూ. 750 కోట్లను కేంద్రం ఆర్థిక సాయం చేయాలన్నారు.
Also Read: విపక్షాలకు బిఆర్‌ఎస్ దూరం.. కారణం అదే !