సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మేనేజ్ సహకారంతో దేశాయ్ కోర్సు పూర్తయిన సందర్భంగా 40 మంది పెస్టిసైడ్స్ డీలర్లకు సర్టిఫికేట్స్ అందజేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “ఎరువులు, క్రిమి సంహరకాలు ఎక్కువగా వాడకుండా జాగ్రత్త పడేలా రైతులకు అవగాహన కల్పించాలి. డీలర్లు రైతుల గురించి ఆలోచన చేస్తూ, అధిక దిగుబడికి ఎరువుల వాడకం అవసరం మేర వాడాలని, అధిక మోతాదులో వాడొద్దని రైతులను చైతన్యపర్చాలి. మీరు పొందిన శిక్షణకు న్యాయం జరగాలంటే, రైతులను సేంద్రీయ వ్యవసాయం చేయాలని, తక్కువ మోతాదులో ఎరువులు వాడేలా సరైన రీతిలో అవగాహన కల్పించాలి.
ఈ యాసంగిలో 52 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పండించి దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పనిముట్ల కోసం 1500 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టింది. అదే విధంగా కలెక్టరేట్ కార్యాలయంలో సిద్ధిపేట నియోజకవర్గంలోని 8 గ్రామాలైన తోర్నాల, బుస్సాపూర్, ఇర్కోడ్, చిన్నగుండవెళ్లి, ఎల్లుపల్లి, నాంచారుపల్లి, మందపల్లి, మల్లారం గ్రామాల్లో 500 ఎకరాల్లో తెలంగాణ సోనా ధాన్యం పండించేందుకు దక్కన్ ముద్ర కంపెనీ ముందుకొచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ నెల 28న ఆయిల్ ఫామ్ సాగుపై 2 వేల మంది రైతులతో వ్యవసాయ శాఖ మంత్రితో కలిసి సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌ను ఆదేశించడం జరిగింది. అతి త్వరలోనే చిన్నకోడూర్ మండలం చండ్లపూర్ గ్రామ రైతులతో కలిసి సెరి కల్చర్, ఎక్స్ పోజర్ విజిట్ కోసం మైసూర్ మరియు ఏప్రిల్ మొదటి వారంలో ఆయిల్ ఫామ్ సాగుపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటన చేయడం జరుగుతుంది.” అని మంత్రి హరీష్ పేర్కొన్నారు.