పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. నిన్నటితో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేశాయి. 18 రోజుల పాటు పెరగని ధరలు మంగళవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 16 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రకటన వెలువడింది. దీంతో పెట్రోలు ధర రూ. 90.56కు, డీజిల్ ధర రూ.80.73కు పెరిగింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియగానే ధరలు పెరగడం గమనార్హం.
కాగా, గత సంవత్సరంలో పెట్రోలు ధర సగటున రూ. 21.58, డీజిల్ ధర రూ. 19.18 పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పెట్రో ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిన కారణంగానే ధరలను పెంచలేదని, మొత్తం మీద 7 శాతం వరకూ డిమాండ్ తగ్గిందని చమురు కంపెనీలు అంటున్నాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయని, ఆ కారణంగానే ఇండియాలోనూ ధరలను సవరించాల్సి వచ్చిందని స్పష్టం చేశాయి.