కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలందించండి..

18
minister ik reddy

కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర,అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు, బాధితులకు అందుతున్న వైద్యసేవలను జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీతో కలిసి ఆయన పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్య శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కరోనా చికిత్సకు అవసరమైన మందులు,ఆక్సిజన్ తదితర అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైద్య సేవలందించడంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్, భౌతిక దూరం పాటించాలని అన్నారు.

ఈ సమావేశంలో ఇన్చార్జి ఎస్పి ప్రవీణ్ కుమార్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధన్ రాజ్, ఏరియా ఆసుపత్రి సూపర్-ఇండెంట్ డా. దేవేందర్ రెడ్డి, కమీషనర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.