వినోద్ కుమార్‌తో FTCCI ప్రతినిధుల భేటీ..

211
vinod kumar
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా పండిన వరి పంట ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఉన్న పరిస్థితులు, మార్కెటింగ్ వంటి అంశాలపై లోతుగా అధ్యయనం చేసి నివేదికను అందజేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( ఎఫ్.టీ.సీ.సీ.ఐ ) ప్రతినిధులకు సూచించారు.ఫెడరేషన్ ప్రతినిధులు బుధవారం మంత్రుల అధికారిక నివాసంలో వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. వినోద్ కుమార్ ను కలిసిన వారిలో ఫెడరేషన్ అధ్యక్షులు రమాకాంత్, ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి, అనిల్ అగర్వాల్, సీఈఓ ఖ్యాతి అమోల్ నరవానే, మాజీ అధ్యక్షులు కరునేంద్ర జాస్తి ఉన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో వాణిజ్యం, పరిశ్రమల తీరుతెన్నులతోపాటు పలు అంశాలపై ఫెడరేషన్ ప్రతినిధులతో వినోద్ కుమార్ చర్చించారు.వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ఫెడరేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని వినోద్ కుమార్ పేర్కొన్నారు.ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని వరి ఉత్పత్తులకు విదేశాల్లోని మార్కెట్ లో డిమాండ్ కల్పించేందుకు ఫెడరేషన్ ప్రతినిధులు చొరవ చూపాలని వినోద్ కుమార్ కోరారు. వరితోపాటు పత్తి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఉన్న అనువైన మార్గాలను పరిశీలించాలని వినోద్ కుమార్ ఫెడరేషన్ ప్రతినిధులకు సూచించారు.

కాగా, ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్ల క్రితం ఫెడరేషన్ కార్యాలయం కోసం బంజారాహిల్స్ లోటస్ పాండ్ వద్ద రెండు వేల గజాల స్థలాన్ని మంజూరు చేయగా తాము డబ్బులు కూడా చెల్లించామని, కానీ ఆ స్థలం కోర్ట్ వివాదాల్లో పడిందని ఫెడరేషన్ ప్రతినిధులు వినోద్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. వేరే స్థలం కోసం హైదరాబాద్ కలెక్టర్ సీసీఎల్ఏ కు ప్రతిపాదనలు పంపారని, ప్రత్యామ్నాయంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ లో స్థలం కేటాయింపులు జరిగేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుని రావాలని ఫెడరేషన్ ప్రతినిధులు కోరగా, అందుకు వినోద్ కుమార్ హామీ ఇచ్చారు.

- Advertisement -