టీడీపీ తో దోస్తీ.. నహీ !

21
- Advertisement -

ఇటీవల అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడంతో టీడీపీ బీజేపీ మధ్య దోస్తీ కుదిరిందనే వార్తలు గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం దీనిపై ఎలాంటి అధికారిక క్లారిటీ లేకపోయినప్పటికి రెండు పార్టీల మధ్య అంతర్గత ఒప్పందం కుదిరిందనేది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఒకవేళ నిజంగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే.. ఆ దోస్తీ రెండు తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతుందా లేదా ఏపీ వరకే పరిమితం అవుతుందా అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీని ఎదుర్కోవాలంటే కూటమి ఏర్పడక తప్పదు. అందుకే 2014 సీన్ రిపీట్ చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.

నిన్న మొన్నటి వరకు టీడీపీతో కలవడానికి విముఖత చూపిన బీజేపీ.. ఇప్పుడు సానుకూలంగా వ్యవహరిస్తోంది. అయితే ఏపీలో ఈ మూడు పార్టీల వైఖరి ఎలా ఉన్నప్పటికి తెలంగాణలో మాత్రం టీడీపీతో కలవడానికి బీజేపీ ఏ మాత్రం సిద్దంగా లేనట్లే కనిపిస్తోంది. తాజాగా టీడీపీతో పొత్తుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో పొత్తుపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అయితే తెలంగాణలో కూడా టీడీపీ ఎన్నికల బరిలో నిలవనున్న నేపథ్యంలో బీజేపీ, టీడీపీ పార్టీలు ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: సెల్యూట్‌ టూ రావి నారాయణరెడ్డి

ఒకవేళ ఏపీలో ఈ రెండు పార్టీలు జట్టు కడితే ఆ ప్రభావం తెలంగాణలో కూడా చూపుతుంది. అందుకే ప్రస్తుతం పొత్తు విషయంలో ఎలాంటి నిర్ణయం బయటకు చెప్పకుండా ఈ రెండు పార్టీలు జాగ్రత్త పడే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికలు పూర్తి అయిన తరువాత బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఏపీలో టీడీపీతో పొత్తు విషయమై సైలెన్స్ పాటిస్తున్న బీజేపీ, తెలంగాణలో మాత్రం అసలు పొత్తే లేదని క్లారిటీ ఇస్తోంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం కాబట్టి.. ఎన్నికల సమయానికి ఏదైనా జరగవచ్చనేది కొందరి అభిప్రాయం.

Also Read: అమిత్ షాతో రెజ్లర్ల చర్చలు.. నో యూస్ !

- Advertisement -