రంగారెడ్డి జిల్లాలో ఉచిత బియ్యం పంపిణి ప్రారంభం

274
Minister Sabitha Indra Reddy
- Advertisement -

కరోనా వైరస్ నిరోదానికిగాను జిల్లాలో పాటిస్తున్న లాక్ డౌన్ నేపథ్యం లో రంగారెడ్డి జిల్లాలోని 5.25 లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు నేటి నుండి ఉచిత బియ్యం పంపిణి ప్రారంభించినట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కరోన పై మంత్రి నేడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

కరోనా వైరస్ ను అరికట్టడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో వైరస్ ను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం తీసుకొంటున్న చర్యలు, ప్రజలకు నిత్యావసరాలు, అత్యవసర సేవలు, మాస్కులు అందుబాటులో ఉంచడం, ఉచిత బియ్యం పంపిణి, పారిశుద్ధ్యం నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లు హరీష్,ప్రతీక్ జైన్ తదిరులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, కరోనా వైరస్ కట్టడికి ప్రకటించిన లాక్ డౌన్ కి జిల్లా ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని అన్నారు. లాక్ డౌన్ సందర్బంగా నీరు పేదలకు ఇబ్బందులు కలగకుండా వుండేందుకు తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలలోని ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణి చేయడం తో పాటు 15 వందల రూపాయలు పంపిణి చేస్తున్నామని వివరించారు. ఒక్కో రేషన్ షాప్ ద్వారా రోజుకు నలభై మందికి బియ్యాన్ని పంపిణి చేస్తున్నామని అన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధేశాల మేరకు లాక్ డౌన్ ని పాటించి ,నగర ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు.

అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని ఇంట్లోనే ఉండాలని సూచించారు. జిల్లా ప్రజల అవసరాలకు తగ్గట్లుగా రైతు బజార్లలో కూరగాయలు ఏర్పాటు చేసామని, ప్రజలు ఆందోళన చెందవద్దు, ఎక్కడి ప్రజలు ఆ ఏరియ రైతు మార్కెట్ లో కూరగాయలు కొనుక్కోవాలని పేర్కొన్నారు. కొన్ని మార్కెట్ లలో గుర్తింపు కార్డులు లేనందున మార్కెట్ వర్కర్లు పనులకు హాజరు కావడానికి విముఖత చూపిస్తున్నందున వర్కర్లందరికి పోలీస్ శాఖ నుండి ప్రత్యేక పాసులు అందచేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. నిత్యావసర సరుకులకు కొరత రానియ్యమని అన్నారు.

వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. . అవసరమైతే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని అన్నారు. షాపింగ్ మాల్స్ ,సూపర్ మార్కెట్ లలో ఎక్కువ రద్దీ లేకుండా చూడాలని, దుకాణాల ముందు డెట్టాల్స్ ,షాని టైజర్స్ ,నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ మహమ్మారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యాన్ని వీడి స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.

ఈ వైరస్ పై పోరాడడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు, మీడియా అందిస్తున్న సహకారం బ్రహ్మాండంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో ఇకముందు కూడా ముందుకు వెళ్లడానికి ప్రతి ఒక్కరు సహకరించినట్లు అయితే మనం ప్రమాదం నుండి బయట పడవచ్చని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.రంగా రెడ్డి జిల్లాలోని గుచ్చి బౌలి క్వారంటైన్ కేంద్రం లో 57 మంది ఉన్నారని, రాజేంద్ర నగర్ కేంద్రం లో 64 మంది వున్నారని చెప్పారు. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారు ఖచ్చితంగా వారి ఇళ్ళల్లో వేరుగా ఉండటం ఒక్కటే సరైన ప్రత్యామ్నాయం అందుకు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు చుట్టుపక్కల వారు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

జిల్లాలో ధరలు పెంచిన అంశానికి సంబంధించి, నిబంధనలు అతిక్రమించి బయట దేశాల నుండి వచ్చిన వారు బయట తిరుగుతున్న సంఘటనలపై డయల్ 100 కు గాని రంగా రెడ్డి కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లాలోని 560 గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని అపార్ట్మెంట్లు, గేటెడ్ కాలనీల్లో ఉన్న క్లబ్ హౌసులను వెంటనే మూసి వేయాలని ఆదేశించారు.జిల్లాలో పశువులకు దాణా కొరత రాకుండా తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. జిల్లాలో ప్రతియే ఏ.ఈ.ఓ పరిధిలో ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత వేసవిలో ఏవిధమైన నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు కావాల్సిన ఆహార పదార్థాలను అందే విదంగా చర్యలు చేపట్టాలనితెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం లోని వాసవి కాలనీ కి చెందిన కరోనా పాజిటివ్ తో గాంధీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నఒక పేషంట్ తో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడి వైద్య సేవలు ఏవిదంగా అందుతున్నాయని వాకబు చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ మాట్లాడుతూ, రంగా రెడ్డి జిల్లాలో అక్రమంగా ఆహార ధాన్యాలను నిల్వ చేసిన 33 ట్రేడర్లపై కేసులు నమోదు చేసినట్టు, 22 లక్షల విలువైన ఆహార ధాన్యాన్ని సీజ్ చేశామని వివరించారు. రెండు సూపర్ మార్కెట్ లను కూడా సీజ్ చేశామని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎనిమిది పాజిటివ్ కేసులు వచ్చాయని అన్నారు.కరోనా వైరస్ నివారణకు జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు.

- Advertisement -