రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని క్షవర వృత్తి శాలలకు (కటింగ్ షాపులకు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించిన జీఓను బీసీ సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఈ ఉచిత విద్యుత్తు సరఫరా ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నది.రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్జప్తులను పరిశీలించిన మీదట సీఎం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు పరుస్తున్నది. ఈ నిర్ణయం ద్వారా గ్రామ స్థాయి నుంచి జీహెచ్ఎంసీ దాకా వున్న కటింగు, లాండ్రీ షాపులకు, దోభీ ఘాట్లకు 250 యూనిట్ల నాణ్యమైన కరెంటు ఉచితంగా అందుబాటులోకి రానున్నదని సీఎం తెలిపారు. తర తరాలుగా కుల వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న రాష్ట్రంలోని లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. సాంకేతికాభివృద్ధితో పలు రకాల యంత్రాలు వీరి వృత్తుల నిర్వహణలో దోహదపడుతున్న నేపథ్యంలో ఉచిత విద్యుత్తు నిర్ణయం ద్వారా ఆర్థిక వెసులుబాటు కలగనున్నది.