గతంలో ఉచిత ఉపాధి శిక్షణల ద్వారా 300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పలించిన ఎర్రబెల్లి ట్రస్టు, మరోసారి ఉచిత శిక్షణా తరగతులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం తాజాగా వేసిన, వేయనున్న ఉద్యోగాల నోటిఫికేషన్ల నేపథ్యంలో, ఈసారి కనీసం వెయ్యి మందికి ఉద్యోగాలు దక్కేలా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించాలని సంకల్పించింది. ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో, ఆచార్య జయశంకర్ కోచింగ్ సెంటర్ ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో, పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, తొర్రూరు కేంద్రాల్లో ఈ శిక్షణా తరగతులు ఉంటాయి. ఈ శిక్షణలో ఉచిత భోజన వసతితోపాటు, మెటీరియల్‌ను కూడా ఉచితంగా అందిస్తారు. ఈ మేరకు పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉచిత కోచింగ్ మెటీరియల్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒకప్పుడు అన్నదానం మహా దానంగా పేర్కొనేవారు. ఇప్పుడు విద్యా దానంకు మించిన దానం లేదు. అందుకే తమ ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గతంలో నిర్వహించిన ఉచిత శిక్షణ ద్వారా 300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. పాలకుర్తిలో 1500 మందికి, తొర్రూరులో 700 మందికి శిక్షణ ఇవ్వగా, అందులో అనేక మంది ఎస్ఐలు, కానిస్టేబుళ్ళు, జూనియర్ పంచాయతీ అధికారులుగా ఎంపికయ్యారన్నారు.
తాజాగా కనీసం వెయ్యి మందికి ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాలన్న లక్ష్యంతో ఈ ఉచిత శిక్షణా తరగుతులు నిర్వహిస్తున్నామన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నిర్వహించే ఈ శిక్షణ కోసం నిరుద్యోగులు ఆయా మండల పార్టీ కార్యాలయాల్లో తమ పేర్లను ఆధార్ కార్డుల ఆధారంగా 7386616660 అనే నెంబర్ పైగానీ, తొర్రూరులో అయితే, 9550032354 అనే నెంబర్ ద్వారా, పాలకుర్తిలో అయితే, 6301026212 అనే నెంబర్ ద్వారా నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు.
ఏప్రిల్ 3 నుంచి ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభం అవుతాయని, తొర్రూరులో టెట్ ఉపాధ్యాయ…శిక్షణ, పాలకుర్తిలో ఎస్.ఐ., కానిస్టేబుల్ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తారన్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచేత తరగుతులు నిర్వహిస్తారు. కనీసం 50 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు ఉంటాయని మంత్రి వివరించారు. ఈ అవకాశాన్ని ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జయశంకర్ కోచింగ్ సెంటర్ సత్యానారాయణ చారి, పలువురు ప్రముఖులు, ఉద్యోగార్థులు, ఇతరులు పాల్గొన్నారు.