ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న బీసీ అభ్యర్థులకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఉచిత కోచింగ్ పొందాలనుకునే అభ్యర్థుల కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మంత్రి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ.. నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదే రోజు ఆన్‌లైన్‌లో ఎంపిక పరీక్ష నిర్వహించి తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. 21 నుంచి కోచింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. మొత్తం 16 స్టడీ సర్కిళ్లలో 25 మందికి చొప్పున ఆఫ్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామన్నారు. మరో 50 వేల మందికి ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.
వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందిస్తామన్నారు. గ్రూప్ -1, గ్రూప్-2 కోచింగ్‌కు ఎంపికయ్యే 10 వేల మంది అభ్యర్థులకు స్టైఫండ్ ఇస్తామని ప్రకటించారు. గ్రూప్-1 అభ్యర్థులకు ఆరు నెలల పాటు రూ. 5 వేల చొప్పున, గ్రూప్-2 అభ్యర్థులకు 3 నెలల పాటు నెలకు రూ. 2 వేల చొప్పున స్టైఫండ్ ఇస్తామన్నారు.
ఎస్సీ ఉద్యోగార్థుల కోసం 33 జిల్లాల్లో ఉచిత కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. ఒక్కో జిల్లా కేంద్రంలోని స్టడీ సెంటర్లలో 75 నుంచి 150 మందికి ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి, కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉన్నవారికి అవకాశం కల్పించనున్నారు. డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
అర్హులైన అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. డిగ్రీ మార్కుల ఆధారంగా 19వ తేదీన మెరిట్ జాబితాను రూపొందించి, 20న విడుదల చేయనున్నారు. అర్హత సాధించిన అభ్యర్థుల మొబైల్ ఫోన్లకు మేసేజ్‌లు పంపనున్నారు. 22న సర్టిఫికెట్లను పరిశీలించి, 25 నుంచి ఉచిత కోచింగ్‌ను ప్రారంభించనున్నారు.
ఈ ఉచిత కోచింగ్ ఒకటిన్నర నెలల నుంచి రెండు నెలల దాకా కొనసాగనుంది. కోచింగ్‌కు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి రోజు రూ. 75 చొప్పున(లంచ్, టీ కోసం) చెల్లించనున్నారు. దీంతో పాటు రూ. 1500 విలువ చేసే మెటిరీయల్‌ను కూడా అందించనున్నారు. రిజిస్ట్రేషన్ కోసం http://tsstudycircle.co.in అనే వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.