ఫ్రాన్స్ ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకూ అక్కడ అలాంటి చట్టమే లేదు. కానీ..ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రతిపాదిస్తుండటం గమనార్హం. అసలు విషయానికొస్తే..శృంగారానికి పరస్పర సమ్మతి పరంగా ఫ్రాన్స్ ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదన చేసింది. ఇందుకు కనీస వయసును 15 ఏళ్లుగా ప్రతిపాదించింది.
ఇటీవల ఇద్దరు 11 ఏళ్ల అమ్మాయిలతో వయోజనులైన పురుషులు శృంగారంలో పాల్గొన్న కేసులను పరిశీలించిన పిదప ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదిస్తుండటం గమనార్హం. ఫ్రాన్స్‌లో ఇలాంటి చట్టం ఇప్పటివరకు లేదు. ఈ తరహా చట్టం రానుండటం ఇదే మొదటిసారి.
తాజా ప్రతిపాదనకు సంబంధించిన బిల్లును ఈ నెలాఖర్లో పార్లమెంటుకు నివేదించనున్నట్లు ప్రభుత్వ మహిళా వ్యవహారాల కార్యాలయం తెలిపింది. కాగా, అంతకుముందు ఈ వయసును 13 ఏళ్లుగా నిర్ణయించాలని అధికారులు చర్చించారు. కానీ, దేశాధ్యక్షుడు ఎమాన్యువల్ మేక్రాన్ సహా పలువురు ఈ వయసు అంతకంటే కాస్త ఎక్కువగా ఉంటే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కాగా, ఇటీవల దిగ్ర్భాంతికి గురిచేసిన రెండు కేసుల్లో 11 ఏళ్ల మైనర్లతో శృంగారం చేసినట్లు పురుష వయోజనులపై ఆరోపణలు వచ్చాయి. ఫ్రెంచ్ చట్టం ప్రకారం ఇది సమ్మతమేనన్న భావనతో వారు ఈ చర్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కనీస వయసు 15 ఏళ్లుగా ఉండాలనే ప్రతిపాదన తెరపైకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.