ఫిఫా ప్రపంచకప్ నాకౌట్లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ అదరగొట్టేసింది. శనివారం జరిగిన తొలి ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో 3-4 తేడాతో ఫ్రాన్స్ చేతిలో అర్జెంటీనా ఓడింది. ప్రారంభం నుంచి అతి కష్టమ్మీద నాకౌట్ దశకు వచ్చిన అర్జెంటీనా చివరికి ఓటమిని చవిచూసింది. దీంతో మెస్సీ సేనకు నిష్క్రమణ తప్పకపోగా అటు ఫ్రాన్స్ క్వార్టర్స్‌లో ప్రవేశించింది. ఈ జట్టుకు గ్రిజ్‌మన్ (13వ నిమిషంలో) పెనాల్టీ కిక్‌తో తొలి గోల్ అందించగా ఆ తర్వాత బెంజమిన్ పవార్డ్ (57), ఎంబప్పే (64, 68) గోల్స్ సాధించారు. అర్జెంటీనా నుంచి ఏంజెల్ డి మారియా (41), మెర్కాడో (48), అగ్వెరో (90+3) గోల్స్ చేశారు.
ఇక మెస్సి గురించి చెప్పాలంటే.. డీగో మారడోనా తర్వాత మళ్లీ అర్జెంటీనాకు ప్రపంచ ఫుట్‌బాల్‌లో అంతటి ఆకర్షణ తెచ్చిన ఆటగాడు మెస్సి. కానీ మారడోనాలా ప్రపంచకప్‌ను మాత్రం ముద్దాడలేకపోయాడు. గత కొన్ని పర్యాయాల నుంచి అర్జెంటీనా జట్టులో ఎవరున్నా లేకున్నా.. ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటిగా ఉంటోందంటే అందుకు కారణం మెస్సినే. అతడి ఆట కోసమే అర్జెంటీనాను అనుసరించే వాళ్లు కోట్ల మంది ఉన్నారు. ఐతే మెస్సి నిష్క్రమణతో ఇకపై ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఆకర్షణ మొత్తం పోతుందనడంలో సందేహం లేదు.