ఇది టెస్టు కాదు టీ20..పాక్‌కు చుక్కలే!

323
- Advertisement -

మాములుగా టెస్టు మ్యాచ్ అంటే బోర్..చప్పగా సాగుతుంది కాబట్టి అంతగా చూడటానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఇంగ్లాండ్ – పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ టీ20ని తలపించింది. పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఒక్కరోజే 500 పరుగులు చేయగా ఇందులో నలుగురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేశారు. తొలిరోజు కేవలం 75 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 506 పరుగులు చేసింది ఇంగ్లాండ్. దీంతో 112 ఏళ్ల కిందటి రికార్డును ఇంగ్లండ్ జట్టు తిరగరాసింది.

1910 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు 494 పరుగులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఇదే అత్యధిక పరుగుల రికార్డుగా తాజాగా ఇంగ్లాండ్ దీనిని అధిగమించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ సెంచరీలతో అదరగొట్టారు. తొలి వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జాక్ క్రాలే 122 (111 బంతుల్లో, 21 ఫోర్లు), బెన్ డకెట్ 107 (110 బంతుల్లో, 15 ఫోర్లు) చేయగా ఓలీ పోప్ (108 పరుగులు, 104 బంతుల్లో, 14 ఫోర్లు), హారీ బ్రూక్ అయితే కేవలం 81 బంతుల్లోనే 101 పరుగులు (14 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. షకీల్ వేసిన 68వ ఓవర్లో 6 బంతులకు 6 ఫోర్లు బాది ఔరా అనిపించాడు. పాక్ బౌలర్లంతా తేలిపోయారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -