కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 52లోని స్వగృహంలో శివశంకర్ పార్థవదేహాన్ని ఉంచారు. శివశంకర్ 1929 ఆగస్టు 10న హైదరాబాద్ జిల్లా మామిడిపల్లిలో జన్మించారు.
అమృత్‌సర్ హిందూ కాలేజీ నుంచి బీఏ పట్టభద్రులయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 1974-75లో న్యాయమూర్తిగా పనిచేశారు. 1979 సంవత్సరంలో జరిగిన ఆరో లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1980లో నిర్వహించిన రీ ఎలక్షన్‌లో తిరిగి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1985, 1993 సంవత్సరాల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రెండోసారి విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1987-88 సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. 1994-95 సంవత్సరంలో సిక్కిం గవర్నర్‌గా, 1995-96 వరకు కేరళ గవర్నర్‌గా పనిచేశారు.
మాజీ కేంద్రమంత్రి పి.శివశంకర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా, న్యాయమూర్తిగా, బిసి నాయకుడిగా శివశంకర్ ప్రజలకు ఎన్నో సేవలందించారని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు.