సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన అలోక్ వర్మ శుక్రవారం ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌కు రాజీనామా చేశారు. అలోక్ వర్మను సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి బర్తరఫ్ చేసిన సెలెక్ట్ కమిటీ ఆయనను అగ్నిమాపక సర్వీసుల డైరెక్టర్ జనరల్ పదవికి బదిలీ చేసింది. తనపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చే అవకాశం కల్పించకుండా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ గురువారం పదవి నుంచి తొలగించిందని తన రాజీనామా లేఖలో అలోక్ వర్మ పేర్కొన్నారు.
తనను సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించడాన్ని ‘సహజ న్యాయాన్ని’ హరించడంగా ఆయన అభివర్ణించారు. తాను 2017 జూలై 31వ తేదీన పదవీ విరమణ వయసు పూర్తి చేసుకున్నానని, 2019 జనవరి 31వరకు సిబిఐ డైరెక్టర్‌గా రెండేళ్ల నిర్ణీత పదవీ కాలానికి నియమితుడినయ్యానని కేంద్ర సిబ్బంది శాఖ కార్యదర్శికి పంపిన లేఖలో అలోక్ వర్మ తెలిపారు. తనను ప్రస్తుతం బదిలీ చేసిన అగ్నిమాపక సర్వీసుల డిజి పోస్టుకు సంబంధించి కూడా తన పదవీ విరమణ వయసు పూర్తయిపోయిందని ఆయన తెలిపారు. ఈ కారణంగా తనను నేటి నుంచే పదవీ విరమణ చేసినట్లుగా పరిగణించాలని ఆయన కోరారు.