దాణా కేసు..లాలూ దోషి

200
- Advertisement -

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రాజకీయ జీవితానికి.. బిహార్‌ రాజకీయాలకు పెను మచ్చగా మిగిలిపోయిన పశువుల దాణా కుంభకోణంలో రాంచీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో లాలూను దోషిగా తేల్చింది న్యాయస్ధానం. కోర్టు తీర్పుతో ఆర్జేడీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. ఇప్పటికే ఈ కేసులో లాలూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కొల్పోగా తాజా తీర్పుతో ఆయన రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారింది.

మరోవైపు లాలూ కుటుంబానికి మరో షాక్‌ తగిలింది. మనీలాండరింగ్‌ కేసులో లాలూ కూతురు మిసా భారతి పేరును చేరుస్తూ ఈడీ ఛార్జ్‌ షీట్‌ ఫైల్‌ చేసింది. మిసాతోపాటు ఆమె భర్త, మరికొందరి పేర్లను చేర్చి ఆ ఛార్జ్‌ షీట్‌ను ఢిల్లీ పటియాలా హౌజ్‌ కోర్టుకు ఈడీ సమర్పించింది. తీర్పు వెలువడిన నేపథ్యంలో కోర్టు పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బిహార్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చోటుచేసుకున్న పశువుల దాణా కుంభకోణం 1996లో వెలుగులోకి వచ్చింది. 1991-1994 కాలంలో దియోగఢ్‌(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.89 లక్షలకుపైగా అక్రమంగా డ్రా చేసినట్లు లాలూ , మాజీ సీఎం జగన్నాథ్‌ సహా 38 మందిపై సీబీఐ 1997, అక్టోబర్‌ 27న చార్జిషీట్‌ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు.

చియబస ట్రెజరీ నుంచి రూ.37.5 కోట్లు నగదు అక్రమంగా ఉపసంహరించిన కేసులో గతంలో  లాలూకు సీబీఐ కోర్టు అయిదేళ్ల జైలు, రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పుతో కొన్నాళ్లు జైళ్లో గడిపిన  లాలూ 2013లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు.

Fodder Scam Case Verdict

తర్వాత 2014లో ఈ కేసుపై జార్ఖండ్ హైకోర్టు  స్టే విధించింది. ఒక కేసులో అప్పటికే శిక్ష విధించబడిన వ్యక్తిపై అవే ఆధారాలు.. అవే సాక్ష్యులతో విచారించటం సరికాదని కోర్టు తెలిపింది. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు స్టే పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

దాణా కుంభకోణంలో వివిధ అభియోగాలు దాఖలు కావడంతో వాటన్నింటిలో లాలూ వివరణ ఇవ్వాల్సిందేనని, లేని పక్షంలో విచారణకు అడ్డంకులు    ఏర్పడే అవకాశం ఉందని సీబీఐ వాదించగా.. సుప్రీంకోర్టు ఆ వాదనతో ఏకీభవించింది. లాలూను ఇతర కేసుల్లో విచారించాలని 2017 మేలో ఆదేశించింది. దీంతో సీబీఐ న్యాయస్థానం ప్రస్తుత కేసు విచారణ ముమ్మరం చేసి, వాదనలు పూర్తిచేసింది.

- Advertisement -