హైదరాబాద్ నగరంతో పాటు దాని చుట్టుపక్కల వున్న చెరువులను అందంగా తీర్చిదిద్దడంతో పాటు దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ పరిపాలన, అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ తెలిపారు.ఆదివారం దుర్గంచెరువులో పేరుకున్న గుర్రపుడెక్కపాటు ఇతర వ్యర్థాలను తొలగించే ఫ్లోటింగ్ ట్రాష్ మిషన్ పనులను, చెరువులో దోమల పెరుగుదలను అరికట్టేందుకు వినూత్నంగా డ్రోన్ ద్వారా యాంటీ లార్వా పైరోఫిన్ ఆయిల్ స్ప్రేయింగ్ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ..చెరువులను కలుషితం చేస్తున్న గుర్రపుడెక్క ఇతర చెత్తా చెదారాన్ని తొలగించుటకు హెచ్ ఎం డి ఎ ద్వారా 7 ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. జి హెచ్ ఎం సి ద్వారా మరో 6 ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్లు కొనుగోలుకు ఆర్డర్ చేసినట్లు తెలిపారు. ఈ యంత్రాలను నిరంతరం పనిచేయుంచుటకు 12 నెలలకు షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. దుర్గంచెరువు శుద్దీకరణ పనులు 15 రోజులు పడుతుందని తెలిపారు. వ్యర్దాలు పెరిగినపుడు మరలా ఈ యంత్రాన్ని డెప్యూట్ చేయనున్నట్లు తెలిపారు.
2016 లో హుస్సేన్ సాగర్ శుద్దీకరణకు ఎఫ్ టీ సీ ల వినియోగంలోకి తెచ్చినట్లు తెలిపారు . 2019 లో జిల్లెలగూడ చందన్ చెరువు, రాంపల్లి చెరువు, నాగారం అన్నరాయుని చెరువు, దమ్మాయిగూడ చెరువు లను ఎఫ్ టీ సి ల ద్వారా శుద్దీకరణ చేసినట్లు తెలిపారు. ఎఫ్ టీ సి లతో మంచి ఫలితాలు లభిస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండు నెలలపాటు అమీనపూర్ మండలం ఇసుకానరి మల్లన్న కుంట, ఘట్కేసర్ మండలం కొర్రెముల తెల్లకుంట, హయత్ నగర్ మండలం పసుమాముల చెరువు లను శుద్దీకరణకు ఎఫ్ టీ సి లను వినియోగించనున్నట్లు తెలిపారు.షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్క చెరువుశుద్దీకరణ చేయనున్నట్లు తెలిపారు. 5 టన్నుల సామర్థ్యం కలిగిన యంత్రాలు ధర రూ 1.50 కోట్లు వున్నదని తెలిపారు. చిన్న యంత్రాలు ధర రూ 1 కోటి ఉన్నట్లు తెలిపారు .
చెరువు నీటిపై తేలియాడుతూ, నాలుగు యాంకర్ లెగ్స్ ద్వారా ముందుకు వెళ్తూ, గుర్రపు డెక్కను, వ్యర్థాలను చెకచెకా తొలగించి, ట్రాష్ కలెక్టర్ లోకి పంపి, ఒడ్డుకు చేర్చుతుంది. ప్రతిరోజూ వందల టన్నుల వ్యర్థాలను తొలగిస్తుంది. చెరువుల పునరుజ్జీవం, సుందరీకరణకు ఇది దోహదపడుతుంది. అలాగే జి హెచ్ ఎం సి. పరిధిలోని చెరువులలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు రూ 60 లక్షలతో యాంటీ లార్వా ఆపరేషన్ లకు ప్రతి జోన్ కు ఒకటి చొప్పున మొత్తం 6 పైరోఫిన్ ఆయిల్ స్ప్రేయింగ్ డ్రోన్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ హరిచందన, హెచ్ ఎం డి ఎ CE . బి ఎల్ ఎన్ రెడ్డి, జి హెచ్ ఎం సి లేక్స్ SE ఎస్ భీమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.