రూ.5 భోజనం తిన్నవాళ్లు కోటిమంది

225
five rupee meal scheme in telangana
five rupee meal scheme in telangana
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు రూపాయల భోజనం పథకంలో ఇప్పటిదాకా కోటిమందికి పైగా కడుపునిండా అన్నం తిన్నారు. మూడేళ్ల కింద ఎలాంటి హడావుడి లేకుండా మొదలైన ఈ పథకం ఇప్పుడు ఇంతలా ఆదరణ పొందుతుందని ఎవరూ ఊహించలేదు. ఇది నిజంగా గొప్ప విషయం. చేతిలో సరిపడా డబ్బులు లేక ఆకలితో అలమటించే పేదవాడికి ఈ పథకం నిజంగా అన్నపూర్ణే. అందుకే దీన్ని ఎంత ప్రశంసించినా తక్కువే.

దేశంలోనే మొదటిసారిగా 2014లో మార్చి 2న నాంపల్లిలోని సరాయిలో ప్రారంభించిన ఈ అన్నపూర్ణ భోజన పథకం ఇప్పటికి 141 కేంద్రాల స్థాయికి విస్తరించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజనాన్ని అత్యంత నాణ్యతతో, పోషకాహారంగా అందిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు అందుబాటులో ఉండే రూ.5 భోజనానికి వాస్తవంగా రూ.24.25 వ్యయం అవుతుంది. ఇందులో బల్దియా రూ.19.25 భరిస్తోంది. త్వరలోనే మరికొన్ని చోట్ల ఈ అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నాలు చేస్తోంది.

WP_20150828_013

అన్నపూర్ణ కేంద్రాల్లో పెదలతో పాటు ఉద్యోగులు.. సంపన్నులు కూడా తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. సికింద్రాబాద్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన కేంద్రంలో వివిధ పనుల కోసం వచ్చే సంపన్నులూ ఈ భోజనం చేస్తున్నారు. నగరంలోని తొమ్మిది ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకొల్పిన కేంద్రాలను నిత్యం 3 వేల మంది రోగుల వెంట ఉండే సహాయకులు ఉపయోగించుకొంటున్నారు. నగరంలో అన్నపూర్ణ కేంద్రాల ద్వారా నిత్యం సుమారు 45 వేలమంది భోజనం చేస్తున్నారు.

అన్నపూర్ణ కేంద్రాల్లో ఇప్పటివరకు భోజనం తిన్న ప్రముఖుల్లో మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ప్రతిపక్ష నేత జానారెడ్డి, గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మాజీ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారుల హెచ్.ఎస్. బ్రహ్మ, ప్రముఖ సంఘ సేవకులు స్వామి అగ్నివేశ్.. ఈ అన్నపూర్ణ భోజనాన్ని రుచి చూశారు. భోజనం నాణ్యతతో పాటు అన్నపూర్ణ నిర్వహణ తీరుపై ప్రశంసలు కురిపించారు. ఇక ఏపీలోని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే ఐదు రూపాయల భోజనానికి ఫిదా అయిపోయి.. తన నియోజకవర్గంలోనూ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇంతలా అందరి మెప్పు పొందింది ఈ ఫైవ్ రూపీస్ మీల్స్. ఇలాంటి రుచిరకమైన నాణ్యమైన భోజనం సిటీలోని ఏ చిన్నపాటి హోటల్ లో అయినా 40 రూపాయలు పెట్టినా దొరకదనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -