బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసంపై కాల్పుల ఘటన ముంబైలో కలకలం రేపింది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న రోహిత్ శెట్టి ఇంటిపై అర్ధరాత్రి సుమారు 12:40 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్లు సమాచారం. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం, యువకుడు బైక్‌పై వచ్చి ఇంటి వైపు ఆరు రౌండ్లు కాల్పులు జరిపి, వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అయితే కాల్పుల శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే జుహు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలన చేపట్టారు. అక్కడ ఐదు బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు చేసిన వ్యక్తి ఎవరు? దానికి గల కారణం ఏమిటి? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇంటికి ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే, సమీప ప్రాంతాల్లోని కెమెరాల ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రోహిత్ శెట్టికి ఎలాంటి బెదిరింపులు వచ్చాయా? ఇటీవల ఆయనతో ఎవరికైనా వివాదాలు ఉన్నాయా? అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగుతోంది.
Also Read:కేసీఆర్‌కు నోటీసులా..?
ఈ ఘటనపై సినీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

