వెనుజులాలో జరిగిన విషాదఘటన హృదయాన్ని కలచివేస్తోంది. వాలెన్సియా నగరంలోని ఓ జైలు లో అగ్నిప్రమాదం జరగడంతో 68మంది ప్రాణాలు కోల్పోయారు. జైలునుంచి ఖైదీలు బయటపడేందుకు ప్రయత్నించడంతో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
కరాబోబో స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆధీనంలోని జైలునుంచి కొందరు ఖైదీలు తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో జైల్లోని పరుపులకు నిప్పంటించారు. దాంతో అగ్నిప్రమాదం జరిగి 68మంది అగ్నికి ఆహుతయ్యారు.
ఖైదీలను చూసేందుకు వచ్చిన వాళ్ళలో మహిళలతో పాటు, చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే ఖైదీల బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కాగా ఈ ఘటనపై కరాబోబో చీఫ్ ప్రాసిక్యూటర్ తరేక్ సాబ్ స్పందించి, విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా..వెనుజులలోని జైల్లల్లో తరచూ అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరుగుతుంటాయి. కారణం.. అక్కడి జైల్లల్లో సామార్థ్యానికి మించి ఖైదీలు కిక్కిరిపోయి ఉండడమే. అయితే ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడి ఖైదీలకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నారు అక్కడి అధికారులు.