తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల సమస్యలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌కు వివరించానని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ మేరకు రాధా మోహన్ సింగ్‌ని కలిసి వెంకయ్య తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చి కొనేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. మే 2 నుంచి మే 31 వరకు కొనుగోళ్లు చేస్తామని ఈ సందర్భంగా రాధామోహన్ సింగ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మిర్చి కొనుగోలు ఉంటుందని వివరించారు. కొన్న మిర్చితో నష్టం వస్తే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాలని ఆయన చెప్పారు.
క్వింటాకు రూ.5వేలు మద్దతు ధర ఇస్తామని చెప్పిన మంత్రి.. అదనపు ఖర్చుల కోసం రూ.1500 ఇస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రం ఎక్కడ ఉండాలనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేస్తే మద్దతు ధర ఉండదని స్పష్టం చేశారు. నేరుగా పంటను అమ్ముకునే రైతులకు లాభం చేకూరుతుందన్నారు మంత్రి. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసిన మిర్చికి నష్టం వాటిల్లితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 శాతం నష్టం భరించాలని నిర్ణయించినట్లు రాధామోహన్ సింగ్ తెలిపారు.
రాధామోహన్ తీసుకున్న నిర్ణయంపై కృతజ్ఞతలు తెలిపారు వెంకయ్యనాయుడు. ఇకపై ఏ పంటకు ధర పెంచితే ఆ పంటను రైతులు వేస్తారని చెప్పిన వెంకయ్య… వాణిజ్య పంటలకు మద్దతు ధరపై విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసే మిర్చికే మద్దతు ధర వర్తిస్తుందని చెప్పారు.