ప్రజానేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి కన్నీటి విడ్కోలు పలికారు ప్రజలు. ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య నెక్లెస్‌రోడ్‌లోని పీవీ ఘాట్‌లో అంత్యక్రియలు జరిగాయి. పీవీ జ్ఞానభూమి పక్కన జైపాల్ రెడ్డి స్మృతి వనం ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.
తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్‌తో పాటు సీనియర్ నేతలు,కుటుంబ సభ్యుల మధ్య జైపాల్ అంత్యక్రియలు ముగిశాయి.
అంతకముందు గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు నేతలు కొనియాడారు. గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్ అని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారని చెప్పారు.
జైపాల్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మల్లికార్జున ఖర్గే. 1964 నుంచి జైపాల్ రెడ్డి తనకు తెలుసునని, విద్యార్థి దశ నుంచే పరిచయమని, ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు.