మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు తుది ఒప్పందం..

371

వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ కి భారీ పెట్టుబడి వచ్చింది. ఇప్పటికే ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు గతంలో అవగాహన ఒప్పందం చేసుకున్న కొరియా టెక్స్టైల్ దిగ్గజం యంగ్వాన్ కార్పొరేషన్, ఈరోజు 900కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. వరంగల్ టెక్స్టైల్ పార్కులో యూనిట్ స్థాపన కోసం తెలంగాణ ప్రభుత్వంతో కార్పొరేషన్ ఈరోజు తుది ఒప్పందాన్ని, పరిశ్రమకు అవసరం అయిన భూ కేటాయింపు పత్రాలను కంపెనీ అందుకుంది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, యంగ్వాన్ కార్పొరేషన్ చైర్మన్ కిహాక్ సుంగ్ మరియు కంపెనీ ప్రతినిధి బృందం, భారత్, కొరియా రాయబారుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్వాన్ కార్పొరేషన్ యాంకర్ యూనిట్ గా ఉంటుంది. ఇందుకోసం సుమారు 900 కోట్ల రూపాయల పెట్టుబడిని పెడుతుంది. యంగ్ వన్ టెక్స్టైల్ యూనిట్ స్థాపన కోసం 290 ఎకరాల భూమి కేటాయింపు పత్రాలను ప్రభుత్వం అందించింది. ఈ యూనిట్ స్థాపన ద్వారా ప్రపంచ స్థాయి టెక్స్టైల్ పరిశ్రమ ఒకటి, వరంగల్ టెక్స్ టైల్ పార్కులో ఏర్పాటు కానున్నది. స్థానికంగా లభించే అత్యుత్తమ కాటన్ ఉత్పత్తిని ఉపయోగించుకొని ఎగుమతులే లక్ష్యంగా, యంగ్వాన్ వివిధ రకాల టెక్స్టైల్ ఉత్పత్తులను తయారుచేయనున్నది. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సూమారు 12 వేల మందికి ఉపాధి లభించనున్నది.

ktrవ్యవసాయ రంగం తర్వాత అంతటి స్థాయిలో ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు చేసిందని, ఇందుకోసం వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసిందని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. ఈ మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన టెక్స్టైల్ పరిశ్రమలను తీసుకురావాలని లక్ష్యంగా పని చేసామని, గుజరాత్ లో జరిగిన టెక్స్టైల్ సమ్మిట్-2017లో కార్పొరేషన్ చైర్మన్ కిసాక్ సుంగ్ తో సమావేశమై, తెలంగాణ పారిశ్రామిక విధానాలను, టెక్స్టైల్ పరిశ్రమకు తెలంగాణలో అనుకూలంగా ఉన్న అంశాలను వివరించడం జరిగిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చైర్మన్ సుంగ్ అప్పుడే ముందుకు వచ్చారని, ఈ మేరకు ఈ రోజు సుమారు 900 కోట్ల రూపాయలతో కంపెనీతో తుది ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ ముఖచిత్రం మారిపోతుందన్న విశ్వాసాన్ని మంత్రి కే. తారక రామారావు వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి తెలంగాణ టెక్స్టైల్ రంగంలో చరిత్రాత్మకమైందన్న మంత్రి, తెలంగాణకి మరిన్ని టెక్స్టైల్ పెట్టుబడులు వచ్చేందుకు దోహదం చేస్తుందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దేశంలో మెగా టెక్స్టైల్ పాలసీ గురించి ఆలోచిస్తుందని, ఈ పాలసీ వస్తే వరంగల్ టెక్స్ టైల్ పార్క్ దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్కు అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. యంగ్ వన్ కార్పొరేషన్ పరిశ్రమ ద్వారా వరంగల్ జిల్లాకి మరింత పెద్ద ఎత్తున పెట్టబడులు, ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా జిల్లా యువతకి ముఖ్యంగా టెక్స్టైల్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, ఇక్కడికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ కి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ టెక్స్టైల్ పార్కులో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు స్థానికంగా అన్ని విధాలుగా సహకరిస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

it minister ktr

యంగ్వాన్ టెక్స్టైల్ రంగంలో ప్రపంచంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్నదని ఇప్పటికే తమకు బంగ్లాదేశ్, వియత్నం, ఇథియోపియా వంటి 13 దేశాల్లో తమ యూనిట్ల ద్వారా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 90 వేల మంది తమ కంపెనీలో కొనసాగుతున్నారని కంపెనీ చైర్మన్ కిహాక్ సుంగ్ తెలిపారు. తెలంగాణలో తమ యూనిట్ ఏర్పాటు కోసం ప్రభుత్వ కృషి 99% ఉంటే తమ ప్లానింగ్ ఒక్క శాతమే అన్నారు.

ఇంత స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం యూనిట్ స్థాపన కోసం చొరవ చూపించిందని, తెలంగాణ ప్రభుత్వ విధానాలే తమను ఇక్కడికి రప్పించాయని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అందించిన సహకారానికి, చొరవకు అయన ధన్యవాదాలు తెలిపారు. సంవత్సరంలోగా తమ యూనిట్ ద్వారా కార్యకలాపాలు ప్రారంభిస్తామని, భవిష్యత్తులో తమ యూనిట్ విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయని అయన తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రులతో పాటు తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కొరియాలో భారత రాయబారి సుప్రియ రంగనాథ్, గౌరవ కాన్సుల్ జనరల్ ఆఫ్ కొరియా ఇన్ హైదరాబాద్ సురేష్ చుక్కపల్లి, టెక్స్ టైల్ శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్, టియస్ ఐఐసి యండి నర్సింహరెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.