మితిమీరిన వాయు కాలుష్యం జనారోగ్యం పాలిట పెనుశాపంగా మారుతోంది. స్వచ్ఛమైన గాలి, రక్షిత తాగునీరు అందడమే కాదు, జీవ వైవిధ్యాన్ని పాటించిన నాడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కానీ రోజురోజుకి పెరిగిపోతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో పర్యావరణ పరీరక్షణ మానవ మనుగడకు పెను సవాల్‌గా మారింది.
ఎన్ని చట్టాలు చేసినా, వాటి అమలులో చిత్తశుద్ధి కొరవడటం, పర్యవేక్షణ యంత్రాంగం కొరత, చట్టాలలో లోపాలు, రాజకీయ వ్యవస్థలో చిత్తశుద్ధి లేమి, అంతా ఇంతేలే అనే భావనతో కూడిన మానసిక దౌర్బల్యం.. చివరికి మానవ మనుగడకే ముప్పు వస్తోంది. పర్యావరణ వ్యవస్థలను ఛిద్రం చేస్తోంది.
అయితే మారుతున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఆరోగ్యం, పర్యావరణంపై కాసింత అవగాహన వస్తుండటంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక కొన్నిదేశాల్లో పర్యావరణ పరిరక్షణపై పలు చట్టాలు చేసి ప్రజల్లో అవేర్‌నెస్ తీసుకువస్తుండగా ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది.
ప్రాథమిక స్ధాయి నుండి హైస్కూల్, కాలేజీ విద్యాభ్యాసం పూర్తి చేసే క్రమంలో 10 మొక్కలు తప్పనిసరిగా నాటాలని స్పష్టం చేశారు. అంతేగాదు డిగ్రీ పట్టా పొందాలంటే ఏ విద్యార్థైనా సరే ముందుగా మొక్కలు నాటాల్సిందేనని పేర్కొంది. ఫలితంగా ప్రతీ ఏటా 175 మిలియన్లు చెట్లు పెరుగుతాయని అధికారుల అంచనా వేస్తున్నారు. ఫీలిప్పిన్స్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సరికొత్త విధానం ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందో వేచిచూడాలి.