ఫిదాతో ఒక్కసారిగా తెలుగులో స్టార్ ఇమేజ్ సంపాదించేసింది సాయిపల్లవి. ఒక హీరోయిన్ తన తొలి సినిమాతో అంత పేరు సంపాదించడం చాలా అరుదనే చెప్పాలి. తెలుగులో అందంతో బలమైన ముద్ర వేసిన వాళ్లున్నారు కానీ.. నటనతో అంత పేరు సంపాదించింది మాత్రం సాయిపల్లవే అయి ఉంటుందేమో. ఆమె రెండో సినిమా ‘ఎంసీఏ’ కూడా హిట్టవడంతో ఆమెది గోల్డెన్ లెగ్ అని అంటున్నారు సినీ జనాలు. ఈ ఊపులో సాయిపల్లవికి మంచి అవకాశాలు వస్తున్నాయి.
దీంతో ఈ భామ ఒక్కసారిగా తన పారితోషికం అమాంతం పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఫిదా పిల్ల తన తదుపరి చిత్రం హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో నటించేందుకు సాయిపల్లవి దాదాపు కోటి 40 లక్షల దాకా పారితోషకం అందుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
ప్రస్తుతం గ్లామర్ ఉన్న స్టార్ హీరోయిన్లు మాత్రమే ఈ స్థాయిలో పారితోషకం తీసుకుంటారు. ఐతే సాయిపల్లవి గ్లామర్ తో ఎప్పుడూ పెద్దగా ఆకర్షించింది లేదు. ‘ప్రేమమ్’ దగ్గర్నుంచి ఆమె నటనే సినిమాలకు ఆకర్షణ అవుతోంది. ఇలా నటనా కౌశలంతోనే క్రేజ్ సంపాదించుకుని ఇంత పారితోషకం తీసుకోవడమంటే గొప్ప విషయమే. కేవలం తన నటన తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఈమె పక్కన స్టార్ హీరో నటించిన కానీ ఈమె నటన ముందు తేలిపోవాల్సిందే..అంతలా అమ్మడు నటన తో ఆకట్టుకుంటుంది. ఇక తెలంగాణ లో అయితే ఈమె నటన కు అంత ఫిదా అవుతున్నారు. అందుకే ఈమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు.