ఖరీఫ్ సీజన్ 2026 భారత వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక మార్పు కనిపిస్తోంది. రసాయన ఎరువుల వాడకం నుంచి రైతులు క్రమంగా సేంద్రీయ (ఆర్గానిక్) ఎరువుల వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రైతులు ఏకంగా 11.17 లక్షల టన్నుల సేంద్రీయ ఎరువులను కొనుగోలు చేశారు.
గత ఏడాది ఇదే సమయానికి జరిగిన 3.2 లక్షల టన్నుల అమ్మకాలతో పోలిస్తే ఇది ఏకంగా 3.5 రెట్లు పెరగడం విశేషం. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ ఎస్. శర్మ ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు అంతర్జాతీయంగా రసాయన ఎరువుల ముడిసరుకుల ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో… భూసారాన్ని కాపాడుకోవడానికి, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రైతులు ఆర్గానిక్ ప్రత్యామ్నాయాల వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు.
సేంద్రీయ ఎరువుల వాడకం పెరుగుతున్నప్పటికీ దేశంలో రసాయన ఎరువుల కొరత ఏమీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026 ఖరీఫ్ సీజన్‌కు గాను మొత్తం 383.9 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేయగా, అందులో ఇప్పటికే 51 శాతానికి పైగా (197 లక్షల టన్నులు) నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. సాధారణంగా ఈ సమయంలో ఉండాల్సిన 33 శాతం నిల్వల కంటే ఇది చాలా ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం ‘వేప పూత పూసిన యూరియా’ ధరను రూ. 242 (45 కిలోల బ్యాగ్) గాను, డీఏపీ (DAP) ధరను రూ. 1,350 (50 కిలోల బ్యాగ్) గాను స్థిరంగా ఉంచి రైతులకు సబ్సిడీలను సకాలంలో అందిస్తోంది. ఈ విధంగా పర్యావరణ అనుకూల సేంద్రీయ పోషకాల వినియోగం పెరగడం వల్ల భవిష్యత్తులో దిగుమతులపై ఆధారపడటం తగ్గి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.
Also Read:‘రాజా ది రాజా’..యూత్ ఫుల్ మెలోడీ

