రిపబ్లిక్ డే..3 లక్షల ట్రాక్టర్లతో రైతుల ర్యాలీ

30
farmers

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న దేశ రాజధాని ఢిల్లీలో రైతులు కిసాన్ గణతంత్ర దివాస్ పరేడ్ నిర్వహించనున్నారు. ఇందుకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. రిపబ్లిక్ డే పరేడ్ ముగిసిన తర్వాత ర్యాలీ నిర్వహించడానికి పోలీసులు అనుమతిచ్చారు.

ఢిల్లీ సరిహద్దుల్లోని మూడు ప్రదేశాల నుంచి మాత్రమే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని సూచించారు.ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసుకోవాలని….ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించరాదని శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకోవాలని పోలీసులు తెలిపారు.

ఢిల్లీ సరిహద్దులోని మూడు ప్రాంతాల్లోని ట్రాక్టర్ ర్యాలీ రూట్ మ్యాప్ ఇదే. ట్రాక్టర్ పరేడ్ సింఘు సరిహద్దు నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి సంజయ్ గాంధీ రవాణా, కంజావ్లా, బవానా, హర్యానాలోని ఆచిండి సరిహద్దుకు వెళ్తుంది.

టిక్రి నుంచి ప్రారంభమై నాగ్లోయి, నజాఫ్‌గఢ్‌, రోహతక్ బై పాస్ మీదుగా అసోద టోల్ ప్లాజా వద్ద ముగియనుంది. ఘజిపూర్ సరిహద్దు నుంచి ప్రారంభమై అప్సరా బోర్డర్, హపూర్ రోడ్, మీదుగా ఐఎమ్ఎస్ కాలేజ్, లాల్ కూన్ నుంచి తిరిగి ఘజిపూర్ కు చేరుకుంటుంది.దాదాపు 3 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని రైతు ప్రతినిధులు వెల్లడించారు.