కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. చర్చలకు రావాలని కేంద్రం పదే పదే విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆహ్వానంపై శనివారం రైతు సంఘాలు స్పందించాయి. డిసెంబర్ 29 న ఉదయం 11 గంటలకు చర్చలకు సిద్ధమని రైతు సంఘాలు కేంద్రానికి తెలిపాయి. అయితే రైతు సంఘాలు నాలుగు అంశాల ఎజెండాను కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్‌కు లేఖ ద్వారా పంపారు.
రైతు సంఘాలు నాలుగు అంశాల ఎజెండా..
1.మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులపై చర్చ జరపాలి.
2.అన్ని రకాల పంటలకు జాతీయ రైతు కమిషన్ సూచించిన లాభదాయకమైన ఎంఎస్‌పీ కి చట్ట బద్దత కల్పించడం.
3.ఢిల్లీ రాజధాని పరిసర ప్రాంతాలలో వాయు నాణ్యత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆర్డినెన్స్ కు సవరణలు చేయాలి..ఆర్డినెన్స్ శిక్షా నిబంధనల నుండి రైతులను మినహాయించాలి.
4.రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ‘విద్యుత్ సవరణ బిల్లు 2020’ ముసాయిదాలో అవసరమైన మార్పులు చేయడంపై చర్చ. జరపాలి.
ఈ నాలుగు అంశాలపై కేంద్రంతో మనసుపెట్టి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని రైతు సంఘాలు లేఖలో పేర్కొన్నారు.