షీ టీమ్స్ పేరిట నోటీసులు..చివరికి!

1
- Advertisement -

ప్రియుడిని ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతో షీ టీమ్స్ పేరిట నకిలీ నోటీసులు సృష్టించిన యువతి వ్యవహారం హైదరాబాద్‌లో కలకలం రేపింది. చాట్‌జీపీటీ సహాయంతో నోటీసులు తయారు చేయించి వాట్సాప్‌లో పంపించినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వ్యవహారం బయటపడటంతో యువతితో పాటు ఆమెకు సహకరించిన వ్యక్తి కూడా పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు.

కూకట్‌పల్లి బాలాజీనగర్‌కు చెందిన తిరునేశ్వర్ అనే వ్యక్తికి వాట్సాప్‌లో షీ టీమ్స్ పేరిట నోటీసులు వచ్చాయి. విచారణకు హాజరు కావాలని వచ్చేటప్పుడు శాండిస్క్ పెన్‌డ్రైవ్ తీసుకురావాలని అందులో పేర్కొన్నారు. ఈ నోటీసులపై అనుమానం వచ్చిన తిరునేశ్వర్ వాటిని షీ టీమ్స్ అధికారులకు చూపించాడు. పరిశీలించిన అధికారులు అవి నకిలీవని గుర్తించారు.

దీంతో నోటీసులు పంపిన హరిని పిలిపించి విచారించారు. మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న తన స్నేహితురాలు, తిరునేశ్వర్ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారని హరి పోలీసులకు తెలిపాడు. యువతి కోరిన మేరకే తిరునేశ్వర్‌ను భయపెట్టేందుకు షీ టీమ్స్ పేరిట నకిలీ నోటీసులు పంపించినట్లు వెల్లడించినట్లు సమాచారం.

Also Read:సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు..లాయర్‌కు నోటీసులు!

ఈ ఘటనపై తిరునేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరి, యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ నోటీసుల తయారీ, వాటి వెనుక ఉన్న ఉద్దేశం తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాల పేర్లను ఉపయోగించి తప్పుడు నోటీసులు పంపడం చట్టపరమైన సమస్యలకు దారితీస్తుందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.

- Advertisement -