ఇటీవల ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారిన ఛాలెంజ్ కికి ఛాలెంజ్. నెట్టింట్లో ఎక్కడ చూసిన సెలబ్రెటీల దగ్గరి నుండి యూత్ వరకు అంతా కికి ఛాలెంజ్ చేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరి అటెన్షన్ కొట్టేశారు. అయితే ఆ కికి ఛాలెంజ్‌కి దేశీ టచ్ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు తెలంగాణ యువకులు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లెకు అనిల్‌కుమార్, పిల్లి తిరుపతి, శ్రీకాంత్‌లు ‘కికి ఛాలెంజ్ విలేజ్ ఫార్మర్ స్టైయిల్ ఇండియా’ అనే వీడియోను రూపొందించారు. వీరిలో అనిల్, తిరుపతిలో లంబాడిపల్లెలోని ఓ వ్యవసాయ పొలంలో జోడెద్దులతో స్టెప్పులు వేశారు. కాసేపు వారు జోడెద్దులను విడిచిపెట్టి ‘కికి డు యు లవ్ మీ’ అంటూ పాట పాడుతూ చేసిన ఛాలెంజ్‌కి అంతా ఫిదా అయ్యారు. అమెరికాకు చెందిన ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ట్రెవార్ నోహ్ వీరిని కికి చాలెంజ్ విజేతలుగా ప్రకటించారు. ఇక వీరి ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.
స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయింది. క్షణాల్లో ఎలాంటి వార్తైనా మారుమూల గ్రామాల్లో వారికి సైతం ఇట్టే తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకుంటూ మై విలేజ్ షో అనే యూ ట్యూబ్ ఛానల్‌ని ఏర్పాటుచేసి తక్కువ టైంలో లక్షల సంఖ్యంలో సబ్‌స్క్రైబర్లను పొందారు ఈ యువకులు.
లంబాడి పల్లెకు శ్రీకాంత్,రాజు,అనిల్,శివ అనే నలుగురు యువకులు మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ఏర్పాటుచేసి లెటెస్ట్ ట్రెండింగ్ కాన్సెప్ట్‌లకు విలేజ్ బ్యాక్‌గ్రౌండ్,తెలంగాణ స్లాంగ్ జోడించి సక్సెస్ సాధించారు. వీరికి గంగవ్వ తోడవడంతో ఎదురులేకుండా పోయింది. వీరి వీడియోలకు నెటిజన్ల నుండి ఉహించని స్పందన రావడంతో ఈ యువకుల జీవితాలే మారిపోయాయి. మై విలేజ్ షో నుండి వీడియో ఎప్పుడు వస్తుందా అనేలా ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు.
బోనాలు, బతుకమ్మ, క్రికెట్, సినిమా, టెక్నాలజీ ఇలా పల్లె నుంచి పట్నం దాకా, ఇంటి నుంచి ఇంటర్నేషనల్ టాపిక్స్ దాకా అన్నీ కవర్ చేస్తూ సక్సెస్ సాధించారు. . పెద్దగా స్క్రిప్ట్ కూడా ప్లాన్ చేసుకోరు. ఒక టాపిక్ అనుకుని దాని మీద వీడియో చేసుకుంటూ డైలాగులు అల్లుకుంటూ పోతారు.
సందేశాత్మక చిత్రాలు తీయాలన్న తపన, ప్రజలకు అవగాహన కల్పించాలన ఆలోచన శ్రీకాంత్‌ను డైరెక్టర్‌ను చేయగా రాజును యాక్టర్‌ని చేసింది. గంగవ్వను సెలబ్రెటీ చేయగా లంబాడిపల్లి ప్రపంచానికి పరిచయం చేసింది.