విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తోందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్న ఒక సందేశం (మెసేజ్) పూర్తిగా నకిలీదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ వస్తున్న ఈ సందేశాన్ని నమ్మవద్దని హెచ్చరించింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫాక్ట్ చెక్ విభాగం ఈ ఆన్‌లైన్ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి ఉచిత ల్యాప్‌టాప్‌ల పథకాన్ని అమలు చేయడం లేదని, వైరల్ అవుతున్న సందేశానికి భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, అధికారిక సమాచారం కోసం మాత్రమే ప్రభుత్వ పోర్టళ్లను చూడాలని సూచించింది.
ఈ నకిలీ సందేశంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పేరు, లోగోతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని ఉపయోగించారు. ప్రజలను నమ్మించడానికి “గవర్నమెంట్ ఫ్రీ ల్యాప్‌టాప్స్ పొందేందుకు ఆన్‌లైన్‌లో అప్లై చేయండి” అని ఒక బటన్ (లింక్) ను కూడా చేర్చారు. సరిగ్గా ప్రభుత్వ అధికారిక ప్రకటనలాగే కనిపించేలా ఈ గ్రాఫిక్‌ను రూపొందించినప్పటికీ, ఇది పూర్తి అబద్ధమని పిఐబి స్పష్టం చేసింది. ఈ సందేశాన్ని లేదా అందులోని లింక్‌ను ప్రభుత్వం ఏమాత్రం ధృవీకరించలేదు.
సోషల్ మీడియా మరియు వాట్సాప్ వేదికల్లో కనిపించే ఇలాంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దని పిఐబి ఫాక్ట్ చెక్ హెచ్చరించింది. ఇటువంటి నకిలీ సందేశాలు యూజర్లను అసలైన ప్రభుత్వ వెబ్‌సైట్‌ల మాదిరిగానే ఉండే నకిలీ సైట్‌లకు (ఫిషింగ్ సైట్‌లు) తీసుకెళ్తాయి. అక్కడ దరఖాస్తు పేరుతో మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారాన్ని సేకరించి మోసం చేసే ప్రమాదం ఉంది.
Also Read:CWG విజేతలపై మోదీ ప్రశంసలు
కేవలం ప్రభుత్వ లోగోలు, శాఖల పేర్లు లేదా ప్రధాని ఫోటోలు ఉన్నంత మాత్రాన అది నిజమైన ప్రభుత్వ పథకం అయిపోదని అధికారులు స్పష్టం చేశారు.

