కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జబల్ పూర్‌లో 8 కిలోమీటర్ల భారీ రోడ్ షోను నిర్వహించారు రాహుల్. ఈ సమయంలో రాహుల్‌కు స్వాగతం పలికేందుకు మూడు రంగుల బెలూన్లతో,మరికొంతమంది హారతి ఇచ్చేందుకు ముందుకుకొచ్చారు కార్యకర్తలు.
అయితే ఒక్కసారిగా హారతి మంట బెలూన్లకు తగటడంతో నైట్రోజన్ వాయువు అంటుకుని మంటలు చెలరేగాయి. మంటలు రావడంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. రాహుల్ వాహనం వరకు రాకుండానే మంటలు ఆగిపోయాయి. రాహుల్ గాంధీతో పాటు జ్యోతిరాదిత్య సిందియా, కమల్‌నాథ్ కూడా ఉన్నారు. అయితే ఎవరికి ఏం జరగకపోవడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.
గతంలో రాహుల్ కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా.. విమానం ఒక పక్కకు ఒరిగిపోయింది. గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొందరు తనపై రాళ్లు విసిరారని రాహుల్ పార్లమెంటులో ప్రస్తావించారు.