గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 మున్సిపల్ వార్డులలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి ప్రారంభిస్తోంది. ప్రస్తుతం ప్రతి రోజు జిహెచ్ఎంసి సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ మరోసారి మొత్తం వార్డు యూనిట్‌గా చేపట్టి సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిహెచ్ఎంసిలోని శానిటేషన్ ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, ఎంటమాలజి, అర్బన్ బయోడైవర్సిటీ, వెటర్నరీ, యు.సి.డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలన్నింటిని ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రతి వార్డులో రెండు లేదా మూడు రోజులు జరిగే ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో పరిసర వార్డులలోని 50శాతం క్షేత్రస్థాయి సిబ్బంది సేవలను ఉపయోగించుకోనున్నారు. మిగిలిన 50శాతం క్షేత్రస్థాయి సిబ్బంది ఆయా వార్డుల్లో రోజువారి శానిటేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈ పారిశుధ్య కార్యక్రమంలో స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌లు, స్వయం సహాయక బృందాలు, మహిళా ఆరోగ్య కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొనేలా చర్యలు చేపట్టారు. ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో ఆయా వార్డుల్లో ప్రధాన రహదారులన్నింటిని పూర్తిస్థాయిలో క్లీన్ చేయడంతో పాటు రోడ్లపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చివేస్తారు. వార్డులో ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలను, ఖాళీ స్థలాలు, రహదారుల వెంట ఉన్న పిచ్చి మొక్కలన్నింటిని తొలగిస్తారు. డ్రెయిన్‌లు, నాలాల్లో ఉన్న ఘన వ్యర్థాలను, పూడికలను తొలగించడంతో పాటు సీవరేజ్ లైన్ల మరమ్మతులు కూడా చేపడుతారు.
ప్రజా ఆరోగ్యానికి ముప్పుగా ఉండే కవర్లను మ్యాన్‌హోళ్లను, దెబ్బతిన్న సీవరేజ్ లైన్లను గుర్తించి వాటికి మరమ్మతులు చేపడుతారు. చెత్తకుప్పలుగా మారిన ట్రాన్స్‌ఫార్మర్‌లను గుర్తించి వాటిలో చెత్తను తొలగించి శుభ్రపర్చడంతో పాటు రహదారులపై ఉన్న బురదను, చెత్తను తొలగిస్తారు. ఫుట్‌పాత్‌లు, డీవైడర్ల మరమ్మతులు చేపట్టి, సెంట్రల్ మీడియంలకు పెయింటింగ్ చేపడుతారు. బహిరంగ మలమూత్ర విసర్జన కేంద్రాలను గుర్తించి వాటిని పూర్తిస్థాయిలో తొలగిస్తారు. అవసరమైన ప్రదేశాల్లో పారిశుధ్య కార్యక్రమాలపై చేపట్టాల్సిన, చేపట్టకూడని వివరాలతో ప్రత్యేక సైన్‌బోర్డులను ఏర్పాటు చేస్తారు.
అన్ని హోటళ్లు, ఫుడ్ వెండర్లు, ఫుట్‌పాత్‌లపై ఆహారాన్ని తయారుచేసే అన్ని రకాల హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో శుభ్రత పాటింపుపై తనిఖీలు నిర్వహిస్తారు. వార్డులో ఉన్న డంపర్ బిన్‌లు, కంప్యాక్టర్లకు పెయింటింగ్ వేయించడం, ఎంటమాలజి విభాగం ద్వారా ఫాగింగ్, లార్వా నివారణ కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతారు. వీధి కుక్కల బెడదకు సంబంధించిన అంశాలను కూడా పరిష్కరిస్తారు. ఆయా వార్డుల పరిధిలో ఉండే పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లలో టాయిలెట్లను పరిశుభ్రంగా నిర్వహించేలా చర్యలు చేపట్టడంతో పాటు టాయిలెట్ల సమాచారాన్ని తెలియజేసే ప్రత్యేక సైన్‌బోర్డును ప్రదర్శిస్తారు.
ప్రతి వ్యాపార, వాణిజ్య, దుకాణదారులు తప్పనిసరిగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు రెండు బిన్‌లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతారు. జిహెచ్ఎంసి ద్వారా గార్బేజ్‌ను తరలించే వాహనాలన్నింటిని వాష్‌చేసి క్లీన్‌గా ఉంచడం, అవసరమైన మైనర్ రిపేర్‌లను ఈ డ్రైవ్‌లకు ముందుగానే చేపడుతారు. ఈ వార్డువారి సంపూర్ణ స్వచ్ఛ కార్యక్రమ డ్రైవ్‌ను ప్రారంభించేందుకు ముందుగానే ఈ వాహనాల మరమ్మతులు చేపట్టాలని జోనల్, డిప్యూటి కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు.
Exclusive Sanitation Program in 150 Wards In Greater Hyderabad..Exclusive Sanitation Program in 150 Wards In Greater Hyderabad..