గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది (CISF) తనిఖీల్లో భాగంగా భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు ఉపయోగించే అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు.
గోవా నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైన ఇద్దరు అనుమానాస్పద ప్రయాణికులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారులు అడ్డుకున్నారు. వారి లగేజీని క్షుణ్ణంగా పరిశీలించగా కీలక వస్తువులు బయటపడ్డాయి.
నిందితుల వద్ద నుంచి 4 ఎలక్ట్రానిక్ పరికరాలు, 3 సిమ్ కార్డులు, 5 బ్లూటూత్ ఇయర్‌పీస్‌లతో పాటు పరీక్ష అడ్మిట్ కార్డులు, ఆధార్ కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఇటీవల ఐఐటీ గోవాలో నిర్వహించిన ఒక రిక్రూట్‌మెంట్ పరీక్షలో ఈ ముఠా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా, అసలు అభ్యర్థులకు బదులుగా వేరొకరు పరీక్ష రాసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), మిలిటరీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా కీలక విషయాలను రాబట్టాయి. దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఏదైనా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అనంతరం నిందితులతో పాటు, వారి వద్ద లభించిన ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు పత్రాలను తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
Also Read:టీ20ల్లో తిలక్ అరుదైన ఘనత..

