తెలంగాణ బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం తిరుమలలో తప్పిపోయారు. ఖమ్మం జిల్లాలో బూర్గంపాడుకు చెందిన ఆయన శనివారం సాయంత్రం తిరుమలకు వచ్చి.. దర్శనానంతరం కనిపించకుండా పోయారు. ఆయన కోసం చాలాసేపు వెతికిన కుటుంబీకులు తరువాత పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. ఆయన కనిపించడం లేదన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, వారు గుడిలోకి వెళ్లినప్పటి నుంచి సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. చివరిగా ఆయన శ్రీవారి హుండీ వద్ద కనిపించారు. హుండీ సమీపంలో కుంజాభిక్షంతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు కనిపించారు. ఆపై మరెక్కడా ఆయన జాడ తెలియలేదు. ఆలయం లోపలి మిగతా కెమెరాలు, బయట కెమెరాలు పరిశీలించినా జాడ కనిపించలేదు. బయటి కెమెరాల్లో కూడా ఆయన కనిపించలేదు.
కాగా, లోపల తాము హుండీ దగ్గర ఉన్న సమయంలో ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకు వచ్చారని, ఆ సమయంలో రోప్ పార్టీ తమను తండ్రితో వేరు చేసిందని కుంజాభిక్షం కుమార్తె మీడియాకు తెలిపారు. ఆయన ఎక్కడున్నారన్న విషయాన్ని సాధ్యమైనంత త్వరగా కనిపెడతామని తిరుమల వన్ టౌన్ పోలీసులు తెలిపారు. ఆయన ఆచూకీ ఇంకా లభించని స్థితిలో సర్వత్రా టెన్షన్ నెలకొంది. గిరిజనుడైన భిక్షం 1989, 1994లో రెండుసార్లు బూర్గుంపహాడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఇటీవలి కాలంలో అల్జీరియా (మతిమరుపు)తో బాధపడుతున్న ఆయన, గుర్తు తెలియని స్థితిలోనే తప్పిపోయారని భావిస్తున్నారు.