ఇక నుండి ప్రతి శుక్రవారాన్ని హరిత శుక్రవారంగా పాటించాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. దీనిలో భాగంగా రేపు శుక్రవారం నుండి ప్రతి శుక్రవారం హరిత శుక్రవారంగా పాటిస్తూ పెద్ద ఎత్తున రోజంతా మొక్కలను నాటడం, నగరవాసులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈ క్రింది చర్యలు చేపట్టాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ ఎం.దానకిషోర్ లు ఆదేశాలు జారీచేశారు.
ప్రతి శుక్రవారం అన్ని స్వచ్ఛ ఆటోలు, వివిధ విభాగాలైన ఎంటమాలజి, అర్బన్ బయోడైవర్సిటీ, ఇంజనీరింగ్ ల వద్ద ఉన్న వాహనాల ద్వారా నర్సరీల నుండి మొక్కలు తరలించి ఇంటింటికి పంపిణీ చేయాలన్నారు. ఏరియా కమిటీలు, వార్డు కమిటీల సభ్యులు, స్వయం సహాయక మహిళలు, సీనియర్ సిటీజన్లను హరితహారంలో భాగస్వామ్యం చేయాలి. నగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా హరితహారంలో తప్పనిసరిగా పాల్గొంటారు.
మాన్సూన్ మానిటరింగ్ పర్యవేక్షక అధికారులుగా నియమితులైన అడిషనల్ కమిషనర్లు, హెచ్.ఓ.డిలు తమకు కేటాయించిన సర్కిళ్లలో హరితహారంలో పాల్గొనాలి.ప్రముఖులు, ప్రముఖ క్రీడాకారులు, సెలబ్రేటిలను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలి. హరితహారం ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కోలాహలంగా నిర్వహించాలి.నాటే మొక్కలు అన్నింటికి జియోట్యాగింగ్ ను చేపట్టాలని అధికారులకు సూచించారు.