మీకు తెలుసా… ఒక్క దోమ…సంవత్సర కాలంలో 700కోట్ల దోమల ఉత్పత్తికి కారణం అవుతుంది. అంటే ఒక దోమను వదిలేస్తే అవి ప్రపంచ జనాభాకు సమానంగా దోమలను ఉత్పత్తి చేస్తాయని అంచనా. ప్రపంచంలో ప్రతి సంవత్సరం అత్యధిక మరణాలు సంభవించేది కూడా దోమ కాటువల్లే. దోమల వల్ల ఇంత పెద్ద ప్రమాదం ఉన్న దృష్ట్యా దోమల నివారణ కార్యక్రమాలను ప్రాధాన్యతతో చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించి, దోమల ఉత్పత్తికి కారణమైన లార్వా నివారణకు పలు కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి శుక్రవారంను డ్రై డేగా పాటించాలని కమిషనర్ ఎం.దానకిషోర్ ఆదేశించారు.
ఈ మేరకు జిహెచ్ఎంసి మెడికల్ అధికారులు, ఎంటమాలజీ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్యాధికారులు ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించి దోమల నివారణ చర్యలను ఉదృతంగా చేపట్టాలని స్పష్టం చేశారు. దోమల ఉత్పత్తికి కారణమైన లార్వా నివారణ కార్యక్రమాలను నిరంతరం చేపట్టాలని ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని ఎంటమాలజీ విభాగాన్ని ఆదేశించారు. దోమలు, లార్వ నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, ముఖ్యంగా వీటి ఉత్పత్తికి కారణమైన గుంతలలో నీటి నిల్వలు, టైర్లు తదితర వాటిలో నీటి నిల్వలను తొలగించాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించి దోమల వ్యాప్తిని అరికట్టాలని కమిషనర్ ఆదేశించారు.
గ్రేటర్ పరిధిలో 642 ప్రత్యేక బృందాలతో యాంటి లార్వ కార్యక్రమాలను చేపడుతున్నామని, ప్రతిరోజు దాదాపు 1,30,000 ఇళ్లలో దోమల నివారణ కార్యక్రమాలను చేపడుతున్నామని, వీటిలో 3వేల నుండి 3,500 ఇళ్లలో దోమల ఉత్పత్తి ప్రాంతాలను గుర్తిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని చెరువుల్లో గంబూసియా చేపలను వేశామని, డెంగ్యు, మలేరియా వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను జిహెచ్ఎంసి మెడికల్ అధికారులు, ఎంటమాలజి సిబ్బంది నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
డ్రై డేగా పాటించేందుకు చేయాల్సినవి ఇవే…
నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల దోమల వ్యాప్తి చెందకుండా జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది. ముఖ్యంగా సెప్టిక్ లాట్రీన్‌లు, టాయిలెట్ల పై ఉండే గొట్టాలపై ప్రత్యేకంగా మెష్‌లను ఏర్పాటు చేయడం, ఇళ్లలో ఉన్న టైర్లు, పాత కుండలు, కూలర్లలో నీటి నిల్వలను తొలగించడం, ఇంటింటికి లార్వా నివారణ మందును పిచికారి చేయడంతో పాటు నగరంలోని అన్ని పాఠశాలలో అంటు వ్యాధులు, దోమల వ్యాప్తి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున చేపట్టింది.
నేడు హైదరాబాద్ నగరంలో ప్రధానంగా నగర శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ లేని బస్తీలు, కాలనీలలో సెప్టిక్ ట్యాంక్‌లపై ఉన్న ఎయిర్ పైప్‌లపై మెష్‌లను ఏర్పాటుచేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ ఎంటమాలజి విభాగం నేడు చేపట్టింది. అదేవిధంగా ప్రతి శుక్రవారం డ్రై డే పాటించడంలో భాగంగా నేడు నగరంలోని దాదాపు 100కుపైగా పాఠశాలలోని 30వేల మందికిపైగా విద్యార్థినీ విద్యార్థులకు అంటువ్యాధుల నివారణపై చైతన్య కార్యక్రమాలను నిర్వహించినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఓ ప్రకటనలో తెలియజేశారు.